నిరుద్యోగ యువతను కెసిఆర్ ప్రభుత్వ మోసం చేసిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్షను బుధవారం చేపట్టారు. ఈ దీక్ష గురువారం ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న నిరుద్యోగ యువతకు సంఘిబావంగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉంది యువత అని చెబుతూ ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ అడిగితే కాల్చిపారేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు.
తెలంగాణ కోసం విద్యార్థులు కాలికి గజ్జ కట్టి అడారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోవడంతోనే 12 వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ కుటుంబం కి సంబందించిన వ్యక్తి ఒకరు పెట్రోల్ పోసుకున్నారని, . అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయనకు అగ్గిపెట్టె దొరకలేదని వ్యంగాస్త్రం వేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతపై వివక్షతతో ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వస్తే విశ్వ విద్యాలయాలు కళ కళ లడుతాయని, ఖాళీలు భర్తీ అవుతాయని అనుకున్నారని తెలిపారు. ఉద్యోగాలు వస్తాయని భావించారని తెలిపారు. కానీ నిరుద్యోగ యువతను కెసిఆర్ ప్రభుత్వం పథకం ప్రకారం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ చేతకాని తనం వల్ల పేపర్ లీకేజీ లు అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. 12 వందల మంది ఉసురుపోసుకొని గద్దెనెక్కిన చరిత్ర కేసీఆర్‌ది అని పేర్కొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్ నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదని చెబుతూ ఇప్పటి వరకు డీఎస్సీ వేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం సిగ్గు చేటన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని..ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం హస్తం ఉన్నట్లే అని బీజేపీ నేత ఆరోపించారు.