ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీ నివాసంలో 14 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ సమావేశమైంది. కాగా, 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం సహా పలు అంశాలపై ‘ఇండియా’ బ్లాక్ సమన్వయ కమిటీ చర్చించింది.
అక్టోబర్ మొదటి వారంలో భోపాల్లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంలోని అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఈ పబ్లిక్ మీటింగ్లో ప్రధానంగా లేవనెత్తనున్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సుమారు 25కుపైగా రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో ఒక తాటిపైకి వచ్చాయి. కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
శరద్ పవార్- ఎన్సీపీ, కేసీ వేణుగోపాల్- కాంగ్రెస్, టీఆర్ బాలు- డీఎంకే, తేజస్వి సూర్య- ఆర్జేడీ, సంజయ్ రౌత్- శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సంజయ్ ఝా- జనతాదళ్ (యునైటెడ్), హేమంత్ సోరెన్- జార్ఖండ్ ముక్తి మోర్చా, రాఘవ్ ఛద్దా- ఆమ్ ఆద్మీ పార్టీ, డీ రాజా- సీపీఐ, ఒమర్ అబ్దుల్లా- నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ- పీడీపీ, జావెద్ అలీ- సమాజ్వాది పార్టీ.. ఇందులో పాల్గొన్నారు.
ఇందులో చర్చకు వచ్చిన అంశాల గురించి కేసీ వేణుగోపాల్ విలేకరులకు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు. సభ్య పార్టీల నేతలతో చర్చలు జరిపి, వీలైనంత త్వరగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు అభిప్రాయపడినట్లు చెప్పారు.