కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం 24 గంటల పాటు నిరసనకు దీక్ష చేపట్టారు.
పోలీసులు బీజేపీ ఉపవాస దీక్షను భగ్నం చేసే క్రమంలో కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని ధర్నా చౌక్ నుంచి తరలించడానికి ప్రయత్నించగా బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. సాయంత్రం 6గంటల వరకే బీజేపీ నిరాహార దీక్షకు అనుమతి ఉందని పోలీసులు అన్నారు. వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని 6.30 గంటల సమయంలో పోలీసులు కిషన్ రెడ్డికి తెలిపారు.
అయితే గురువారం ఉదయం 6 గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి చెప్పడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కిషన్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు. అప్పుడు వెనక్కి తగ్గిన రాత్రి 8గంటల సమయంలో మరోసారి ధర్నా చౌక్‌కు చేరుకుని తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్ రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.
ఈ క్రమంలో కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కిషన్ రెడ్డికి నిరుద్యోగ యువతతో పాటు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. బుధవారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రభుత్వ వైఖరికి అక్రమ అరెస్ట్ నిరసనగా గురువారం కూడా రాష్ట్ర వ్యాపంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలించడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారికి ఛాతీలో గాయాలు అయ్యాయి. కిషన్ రెడ్డి చేతులపై, ఛాతీపై, ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గీరుకుపోయాయి.
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు గోళ్లు గీరుకుపోయిన చోట్ల ఆయింట్మెంట్ ఇవ్వడంతోపాటుగా.. ఛాతీలో అయిన గాయానికి రేపు ఉదయం ఎక్స్‌రే తీసుకోవాలని సూచించారు.
నిరుద్యోగులకు కేసీఆర్ చేసిన మోసాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని దీక్షాస్థలి నుంచి అక్రమంగా తరలించడాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఖండించారు.కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఏమి జరిగిందో అడిగి తెలుసుకున్నారు.