దేశవ్యాప్తంగా 15 నుండి 18ఏళ్ల వయసు గల టీనేజర్లకు సోమవారం ప్రారంభమైన కరోనా టీకాల ప్రక్రియకు మొదటిరోజే పెద్దఎత్తున స్పందన లభించింది. ఇప్పటివరకు 16.85లక్షల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు.
ఈనెల 1వ తేదీ నుంచే కరోనా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కోవిన్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవడమే కాకుండా వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతించడంతో వీరి సంఖ్య పెరుగుతోంది. కొన్ని చోట్ల ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.
పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో టీనేజర్లకు టీకా కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది వరకు టీనేజర్లు ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి, భారత్ బయోటెక్ తీసుకువచ్చిన కోవాక్సిన్‌ను మాత్రమే 18ఏళ్లలోపు పిల్లలకు ఆమోదించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్ ట్వీట్ చేశారు. 18ఏళ్లు దాటిన వారికి కోవిషీల్డ్‌తో సహా అన్ని వ్యాక్సిన్లు ఇవ్వవచ్చని చెరు.
మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు. ఆదివారం రాత్రి నాటికి మొత్తంగా 145.7కోట్ల టీకాలను వేశారు. 90 శాతం మంది పెద్దలు మొదటి డోసు అందుకోగా, 65 శాతం మంది రెండు డోసులను తీసుకున్నారు.
11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి డోసు వంద శాతం మంది తీసుకోగా, మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా వంద శాతమూ వాక్సినేషన్ పూర్తయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వారం రోజులలో ఐదురెట్లు పెరిగిన కేసులు
భారతదేశంలో కొత్త వేరియంట్‌తోపాటు కోవిడ్ కేసులు కూడా పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో సుమారు ఐదు రెట్లు కోవిడ్ కేసులు పెరగడం గమనార్హం. గత సోమవారం 6,358 కరోనా కేసులు నమోదుకాగా, ఈ సోమవారం ఆ సంఖ్య 33 వేలకు పెరిగింది ! దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తూ… సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని నిపుణులు హెచ్చరించడంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ ఆంక్షలను అమలుచేస్తున్నాయి.
దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు సోమవారం ఒక్కసారిగా 6.5కు చేరింది. పరీక్షలు చేసిన శాంపుల్స్‌లో 84 శాతం శాంపుల్స్‌లో ఒమైక్రాన్ వేరియంట్ కనుగొన్నారు. ఒక్కరోజే 4,000 కొత్త కేసులు నమోదైనట్టు తాజా హెల్త్ బులిటెన్‌లో ప్రకటించారు. మరోవైపు, రెండు రోజుల ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 4 వేల కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి జైన్ అసెంబ్లీలో ప్రకటించారు.
అంతర్జాతీయ నివేదికల ప్రకారం… ప్రపంచంలో ఒమిక్రాన్ ఆందోళన నెలకొన్నప్పటికీ దాని వల్ల వ్యాధి తీవ్రత, ఆస్పత్రి ముప్పు తక్కువేనని తెలుస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ సహజ వ్యాక్సిన్‌గా దోహదం చేస్తుందని కొందరు భావిస్తున్నారు. ఆ ఆలోచన ప్రమాదకరమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘ కోవిడ్ పర్యవసానాలపై స్పష్టత లేకపోవడంతో అలాంటి ఆలోచన మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లల ఆన్లైన్ విద్య కొనసాగుతుందని తెలిపారు.