ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్ లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన సనాతన ధర్మంపై విపక్షాల కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో మోదీ మొదటిసారిగా స్పందించారు. ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి వారు ఇటీవల ముంబైలో ఘమండియా (దురహంకారి)కూటమిని నడిపేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకొని ఉంటారని అనుకుంటున్నానని ధ్వజమెత్తారు.
భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహమని మోదీ విమర్శించారు. ‘వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడి చేయాలని వారు నిర్ణయానికొచ్చారు. లోకమాన్య తిలక్, స్వామి వివేకానంద వంటి వారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు’అంటూ మోదీ మండిపడ్డారు.
ఇటీవల ముంబైలో ఓ సమావేశం నిర్వహించి, అక్కడ ‘ఘమాండీ'(అహంకార) కూటమిని ఎలా నడపాలనే విధానం, వ్యూహాన్ని విపక్షాలు నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. అలాగే వారు ఓ రహస్య ఎజెండాను కూడా నిర్ణయించుకున్నారని పేర్కొంటూ భారతదేశ సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం అని ఆరోపించారు. భారతీయుల విశ్వాసంపై దాడి చేయాలని, వేలాది సంవత్సరాలుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నాంటూ విపక్షాలపై మోదీ ఆరోపణలు చేశారు.
భారతదేశ వీరులు, సనాతన సంస్కృతికి మధ్య సంబంధాన్ని ప్రధాని గుర్తుచేశారు. దేవి అహల్యాబాయి హోల్కర్కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని అహంకార విపక్ష కూటమి సంకల్పించిందని మోదీ విమర్శించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతనమే బలమన్నారు. బ్రిటిష్ వారిని సవాలు చేసి, ఆమె తన ఝాన్సీని వదులుకోనని చెప్పిందని ప్రధాని గుర్తుచేశారు.
మహాత్మాగాంధీ సనాతన ధర్మం తన జీవితానికి అవసరమని భావించారని ప్రధాని మోదీ తెలిపారు. ఆయన తన జీవితమంతా రాముడి నుండి ప్రేరణ పొందాడన్నారు. ఆయన చివరి మాటలు కూడా ‘హే రామ్’ అని చెప్పారు. స్వామి వివేకానందుడు, లోకమాన్య తిలక్ కూడా సనాతన స్ఫూర్తిని పొందారని తెలిపారు. బ్రిటిష్ వారు ఉరితీసిన స్వాతంత్ర్య సమరయోధులను తిరిగి భరతమాత ఒడిలో పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పడానికి ఈ సంస్కృతే కారణమని ప్రధాని వెల్లడించారు.
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయంపై మాట్లాడుతూ ఈ విజయం 140 కోట్ల మంది భారతీయులకు చెందుతుందని చెప్పారు. ఇది ఈ దేశ సామూహిక శక్తికి ఉదాహరణ అని చెప్పారు. ఒక దేశం లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రభుత్వాలు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు.
అప్పట్లో మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలం పాలించిన ప్రభుత్వాలు అవినీతి, నేరాలు తప్ప ఇంకేం ఇవ్వలేదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.‘ ఈ రాష్ట్ర ప్రజలను కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.
`ఈరోజు రూ.50 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ’ అని ప్రధాని తెలిపారు.