కేరళలో నిపా వైరస్ వ్యాప్తి కలవరపెడుతున్నది. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ ఆందోళనకర విషయం వెల్లడించారు. కరోనా వైరస్ కంటే నిపా వైరస్ ప్రమాదకరం అని, కొవిడ్-19 కంటే నిపా సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువని పేర్కొన్నారు.
నిపా వైరస్ బారిన పడిన వారిలో మరణాల సంఖ్య 40-70 శాతం వరకు ఉంటుందని, ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మరణాల రేటు 2-3 శాతం మాత్రమేనని తెలిపారు. మరోవైపు కేరళలో మరొకరికి నిపా వైరస్ సోకింది. ఇటీవల ఈ వైరస్ సోకి మరణించిన వ్యక్తితో ఇతడు సన్నిహితంగా ఉండటంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురికి వైరస్ సోకగా.. ఇద్దరు మరణించారు. నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాధి నిర్ధారణ పరీక్షలను పెంచాలని నిర్ణయించింది. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు నిపా చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధాన్ని ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తామని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బహల్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద 2018లో అస్ట్రేలియా నుంచి తెప్పించిన 10 మంది రోగులకు సరిపడా ఔషధం ఉన్నదని, మరో 20 డోసుల ఔషధాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.
కేరళలోనే నిపా కేసులు తరచూ ఎందుకు వెలుగుచూస్తున్నాయనే దానిపై ఐసీఎంఆర్ డీజీ స్పందిస్తూ.. ఈ విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. 2018లో వైరస్ వ్యాప్తి చెందినప్పుడు గబ్బిలాలతో సంబంధం ఉన్నట్టు కనుగొన్నామని చెప్పారు. అయితే గబ్బిలాల నుంచి మనుషులకు ఈ వైరస్ ఎలా సంక్రమిస్తుందో కచ్చితంగా తెలియదని, తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు.