పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. జమ్మూ కాశ్మీర్ లోని యూరి సెక్టార్ లో నియంత్రణ రేఖ గుండా భారత భూభాగంలోకి చొరబడడానికి శనివారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులు ప్రయత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారికి కాల్చి చంపేశాయి.
ఈ విషయాన్ని భారతీయ సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించింది. మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరి మృతదేహాలను రికవర్ చేశామని తెలిపింది. మూడో ఉగ్రవాది మృతదేహాన్ని రికవర్ చేస్తుండగా, పాక్ వైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆ ప్రయత్నాలను విరమించామని వెల్లడించింది.
ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని తెలిపింది. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఇదని వెల్లడించింది. మరణించిన ఉగ్రవాదుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించింది.మరో ఆపరేషన్ లో బారాముల్లా జిల్లాలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారిని స్థానికులైన జాయిద్ హసన్, మొహ్మద్ ఆరిఫ్ లుగా గుర్తించారు.
మరోవైపు, అనంతనాగ్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం కొనసాగిస్తున్న వేట నాలుగో రోజుకు చేరింది. గఢాల్ అడవుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని కచ్చితంగా కనిపెట్టేందుకు సైన్యం డ్రోన్లను రంగం లోకి దించింది. డ్రోన్లతో చేసిన సర్వే ఆధారంగా తీవ్రవాదులు దాక్కొన్న ప్రాంతంపై సైన్యం మోర్టార్ షెల్స్‌తో దాడి చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లోనే కర్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, థోనక్, డీఎస్పీ హుమాయూన్ భట్ , రాష్ట్రీయ రైఫిల్ సైనికుడు రవికుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే.