కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలను కాంగ్రెస్ వ్యతిరేకించింది. హైదరాబాద్ లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మొదటిరోజు ఆమోదించిన తీర్మానం జమిలి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య నిర్మాణంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది.
సీడబ్ల్యూసీ సమావేశంలో సందర్భంగా అంశాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, పవన్ ఖేడా మీడియాకు వివరించారు. జమిలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చిదంబరం తెలిపారు.
చట్టసభల్లో ఈ రాజ్యాంగ సవరణలను ఆమోదించేంత బలం బీజేపీకి లేదని ఆ పార్టీకి తెలుసని చెప్పారు. అయినప్పటికీ దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు కథనాలను సృష్టించేందుకు దీన్ని ముందుకు తెస్తోందని చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, దేశానికి పెను సవాళ్లు విసురుతున్న భద్రతాపరమైన సమస్యలపై చర్చించినట్లు చిదంబరం తెలిపారు. అయితే, సనాతన ధర్మం అంశంపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు. ఈ అంశంపై ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేందుకు సిద్ధంగా లేమని ఖర్గే ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర అంశంపై పరిశీలనలో ఉందన్నారు. ప్రతిపక్ష రాష్ట్రాలకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు చిదంబరం. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను సందర్శించేందుకు ప్రధాని మోడీకి సమయం లేనట్లు కనిపిస్తోందని చిదంబరం ఎద్దేవా చేశారు. చైనాతో సరిహద్దు వివాదంపైనా స్పందించడం లేదని ధ్వజమెత్తారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈ తీర్మానాలు సంతాపానికి సంబంధించినవేనని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన మాజీ సీఎం ఊమెన్ చాందీతోపాటు మణిపూర్ హింసాకాండ, హిమాచల్‌ప్రదేశ్ విపత్తులో మృతి చెందిన పౌరులకు సంతాపం ప్రకటించినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశామని వెల్లడించారు.
కాగా, హైదరాబాద్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తూ అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతను పదిలపరిచేందుకు కుల గణనతోపాటు జనాభా లెక్కల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.