జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పరామర్శించడం కోసం అంటూ వచ్చి, వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కలిసి పోటీచేస్తాయని ప్రకటించడం ద్వారా ఏపీలో రాజకీయ కలకలం రేపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం తాము ఉమ్మడిగా అధికారం చేబడితే ముఖ్యమంత్రి పదవిని కూడా పంచుకోవడం పైన ఉందని స్పష్టం అవుతుంది.
తాజాగా, మంగళగిరిలో శనివారం జరిగిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ఈ విషయమై కలకలం రేపుతోంది. ముఖ్యంగా టిడిపి వర్గాలు ఖంగు తింటున్నాయి. 2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పడమే కాకుండా సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్‌పై మాట్లాడుతామని వెల్లడించారు.
ఎన్నికల్లో గెలిచాక రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుందని చెప్పడం గమనార్హం. జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర దశ, . దిశ మారుస్తామని పవన్ వ్యాఖ్యానింశారు. పదేళ్ల నుంచి మీరు అండగా ఉన్నారని పార్టీ శ్రేణులతో అన్నారని, కొంతమంది 2009 నుంచి ఎదురుచూస్తున్నారని చెబుతూ అది 2024లో సాధిద్దామని భరోసా వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఎవరూ గొడవ పెట్టుకోవద్దని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. టీడీపీతో పొత్తు ఖరారైన క్రమంలో ఆ పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున ఒక కమిటీని ప్రకటిస్తూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని పవన్ తెలిపారు.
మరోవైపు, టిడిపితో పొత్తు ఏర్పర్చుకున్న జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు ఎలాంటి భేషజాలకు పోవద్దని సూచించారు. ఒకరు ఎక్కువ కాదు.. మరొకరు తక్కువ కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశారు.