స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంప్రదాయ కళాకారులు, చేతివృత్తిదారుల కోసం రూ.13 వేల కోట్లతో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (పథకం)ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
రూ.5,400 కోట్ల అత్యాధునిక ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐసిసిసి) – యశోభూమి మొదటి దశను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జిఎస్టి నమోదయ్యే దుకాణాల్లో మేడ్ ఇన్ ఇండియా టూల్‌కిట్స్‌ను కొనుగోలు చేయాలని చేతివృత్తిదారులకు సూచించారు.
గణేష్ చతుర్థి, ధంతేరస్, దీపావళి సహా రాబోయే అన్ని పండుగల సమయంలోనూ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు ‘యశోభూమి’ని ప్రతి కార్మికుడికి (‘విశ్వకర్మ’)కి అంకితం చేస్తున్నాను’ అని ప్రకటించారు.
1.8 లక్షల చదరపు మీటర్ల నిర్మాణంతో మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే ‘యశోభూమి’ పూర్తి పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మోదీ చెప్పారు. రూ. 25 లక్షల కోట్ల విలువైన కాన్ఫరెన్స్ టూరిజం భారతదేశానికి ఒక భారీ అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని తెలిపారు. నూతన మెట్రో స్టేషన్ ‘యశోభూమి ద్వారకా సెక్టార్ 25’ ప్రారంభోత్సవంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్‌కు కూడా యశోభూమి అనుసంధానించబడుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో మెట్రో రైళ్ల వేగాన్ని గంటకు 90 నుండి 120 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ టూల్‌కిట్ ఇ-బుక్‌లెట్‌తో పాటు, పథకం పరిధిలోకి వచ్చే 18 సంప్రదాయ వృత్తులకు చెందిన 18 కస్టమైజ్డ్ స్టాంప్ షీట్లను మోదీ ఆవిష్కరించారు. ఈ పథకం కింద 18 రకాల చేతివృత్తిదారులు, కళాకారులకు శిక్షణ, గుర్తింపు, సర్టిఫికెట్, వడ్డీ లేని లక్ష రూపాయల, రెండు లక్షల రూపాయల రుణాలు అందిస్తారు. మార్కెటింగ్‌కు మద్దతు కల్పిస్తారు.