పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ మహిళలకు ఈ బిల్లు ద్వారా 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. సోమవారమే ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.
లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్‌మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అని నామకరణం చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతూ, మహిళా సాధికారతకు ఈ బిల్లు ఉద్దేశించినదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAను సవరించడం ద్వారా ఢిల్లీ నేషనల్ టెరిటరీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందని చెప్పారు.
ఈ బిల్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మహిళలకు విస్తృత ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాధించడంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టగానే రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని, ఇది 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత మహిళలకు రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని చెప్పారు. బిల్లు చట్టంగా మారితే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.
ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడవ వంత సీట్లను రిజర్వ్ చేశారు. ఒక సీటు కోసం ఇద్దరు మహిళా ఎంపీలు పోటీపడకూడదు. ఓబీసీ క్యాటగిరీలో మహిళలకు రిజర్వేషన్ లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత రిజర్వేషన్లు కేటాయించనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వ్డ్ సీట్లకు రొటేషన్ పద్ధతి కల్పించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్రను పెంచేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారు.
అంతకు ముందు పాత పార్లమెంట్ ప్రత్యేక జాయింట్ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లభించడం తనకు దేవుడిచ్చిన అదృష్టమని భావిస్తున్నానని చెప్పారు. అనేక రంగాల్లో మహిళలు నేతృత్వం వహిస్తున్నారని, కొత్త భవనంలో నారీ శక్తిని బలోపేతం చేసేలా తొలి నిర్ణయం తీసుకోబోతున్నామని తెలిపారు.
ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలు
1) చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్‌ను ఈ బిల్లు తప్పనిసరి చేస్తుంది. తాజా సవరణ ప్రకారం లోక్‌సభలోని మూడింట ఒక వంతు మహిళలకు సీట్లు రిజర్వ్ చేస్తారు. తద్వారా చట్ట సభలో మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది.
2) దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకూ బిల్లు నిబంధనలు వర్తిస్తాయి. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మూడింత ఒక వంతు మహిళలకు కేటాయిస్తారు. ఈ విషయాన్ని అందులోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
3)ఢిల్లీతో పాటు అన్నిరాష్ట్రాల శాసన సభలకు ఈ బిల్లు వర్తిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి రిజర్వేషన్లతో పాటు మహిళలకు మూడింత ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి.
4) రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో 128వ సవరణ చేశాక జనగణన ప్రారంభించనున్నట్లు కేంద్ర పెద్దలు చెబుతున్నారు. జనగణన అయ్యాకే 2027 తర్వాత బిల్లు చట్ట రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.