ఖలీస్థాన్ సానుభూతి పరుడు, ఎన్ఐఏ జాబితాలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్రకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఉందని పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, కెనడాలో ‘రా’ హెడ్, భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించడం వెనువెంటనే జరిగిపోయాయి.
దీనికి భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఢిల్లీలోని కెనడా రాయబారి కెమెరూన్ మెకేకు సమన్లు జారీచేసింది. భారత్‌లోని కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ కెనడా హైకమిషన్‌కు తెలియచేసింది. అంతేకాదు, ఐదు రోజుల్లోగా తమ దేశం విడిచి వెళ్లాలని అల్టిమేటం జారీచేసింది.
‘దీంతో కెనడా తెంపరితనానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టయ్యింది. భారత్‌లోని కెనడా హైకమీషనర్‌కు భారత ప్రభుత్వం మంగళవారం సమన్లు జారీచేసింది.. సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది… సంబంధిత దౌత్యవేత్త ఐదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది.. మన అంతర్గత వ్యవహరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కెనడా దౌత్యవేత్త జోక్యం ఎక్కువ కావడంతో భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
ఇక, కెనడా పౌరుడైన నిజ్జర్‌ను తమ దేశంలోనే హత్య చేయడాన్ని దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించిన జస్టిన్ ట్రూడో. దీన్ని ఏమాత్రం ఉపేక్షించలేమని వ్యాఖ్యానించారు. అయితే, కెనడా ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.
ఈ ఆరోపణలు అసంబద్ధమైనవి, పసలేనవని కొట్టిపారేసిన భారత్ ఖలీస్థానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పిస్తోన్న కెనడా వాటి నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటి సత్యదూరమైన ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా పరిణామాలతో భారత్, కెనడా మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దిగజారాయి.
కాగా ఈ ఏడాది జూన్‌లో ఖలీస్థాన్ మద్దతారుడు, భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ వేదికగా భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందని తమకు సమాచారం ఉందంటూ వ్యాఖ్యానించారు. తమ దేశ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోనే హత్య చేయడాన్ని తమ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఆయన చెప్పుకొచ్చారు. కెనడా విదేశాంగ మంత్రి కూడా భారత్‌పై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు.
