చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకు రావడంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ నూతన చరిత్రకు నాంది పలుకుతున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్లమెంట్ లో మహిళల పాత్ర నామమాత్రంగా మాత్రమే ఉంది. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య దేశాలలో చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం దృష్ట్యా భారత్ చివరి నుండి 20వ స్థానంలో ఉంది.
లోక్సభలో మహిళ ప్రాతినిధ్యం 1970 వరకూ కేవలం 5 శాతంంగా ఉంది. ఇది 2009 నాటికి రెండంకెల శాతం స్థాయికి చేరింది. మొత్తం సభ్యుల సంఖ్యతో పోలిస్తే లోక్సభలో 2019 ఎన్నికల ఫలితాలను బట్టిచూస్తే దాదాపుగా 15 శాతానికి చేరింది. ఇక ఎగువ సభలో ఇది 13 శాతంగా ఉంది.
1951లో లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం. తర్వాత 1957లో ఇదే స్థాయిలో ఉంది. 1962, 1967లలో ఇది 6 శాతం అయింది. కాగా 1971లో 5, 77లో 4, 80లో 5 శాతం అయింది. తర్వాత 1984లో మహిళా శాతం 8 కు చేరింది. 1989లో ఇది 6కు, 1991లో ఏడుకు, 96లో 7కు, 98లో 8 శాతానికి చేరింది.
1999లో ఇది 9 శాతానికి వచ్చింది. 2004లో పడిపోయి 8 శాతానికి చేరింది.2009లో మహిళా సీట్లు 11 శాతానికి చేరాయి. 2014లో ఇది 12 శాతానికి చేరింది. కాగా ఎగువసభ రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యంం 6.9 శాతంగా ఉంది. 2020లో దీని శాతం 10.2 శాతంగా నిలిచింది.
ఇక రాష్ట్రాల అసెంబ్లీలు విధాన సభలలో మహిళల ప్రాతినిధ్యం సగటున చూస్తే మరీ తక్కువగా ఉందని వెల్లడైంది. ఇది సగటున 10 శాతం కన్నా తక్కువగా నిలిచింది. ఇక రాష్ట్రాల వారిగా ఎంపిలు, ఎమ్మెల్యేలుగా ఉన్న మహిళల సంఖ్యలో తేడాలు ఉన్నాయి.
పార్టీలను బట్టి కూడా మహిళలకు టిక్కెట్లు ఇవ్వడంతో వేర్వేరు వైఖరి ప్రదర్శించారు. ప్రస్తుత 17వ లోక్సభలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ల నుంచి ఎక్కువ మంది మహిళా ఎంపిలు ఉన్నారు.
“ఎంతో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరగడమే మా సంకల్పం. నారీశక్తి వందన్ అధినియం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ బిల్లు మీ ఆమోదంతో చట్టంగా మారుతుందని మహిళలందరికీ భరోసా ఇస్తున్నాను” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
“నూతన పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు చట్టసభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని కోరుతున్నాను. సభ్యులు తీసుకునే ఈ కీలక నిర్ణయం మహిళా సాధికారత ప్రారంభానికి నాంది పలుకుతుంది. సెప్టెంబరు 19 దేశ చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోతుంది” అని ప్రధాని సభ్యులను కోరారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళా ఎంపీల సంఖ్య 82 నుంచి 181 పెరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు.