దసరా నుండి విశాఖ నుండి పరిపాలన ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ సమావేశంలో మంత్రులను, అధికారులను ఆదేశించారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయించారు.
అలాగే ముందస్తు, జమిలి ఎన్నికలు పై కేంద్రం నిర్ణయం ప్రకారం ముందుకు వెళతామని చెబుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు మంత్రివర్గం ఆమోదించింది.
అలాగే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని.. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిటైరైన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలకు ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని నిర్ణయించారు. రిటైరైన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్మెంట్ కింద కూడా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చెప్పారు.
ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ చేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్.. ప్రైవేట్ యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా ఈ చర్యలు ఉంటాయి. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
ఇంతకు ముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ చేశారు. దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయని తెలిపారు. దీని వల్ల పిల్లలకు మేలు జరుగుతుందని చెప్పారు.
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పధకం ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరనుంది. యుపిఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపారు. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు.. జగనన్న ఆరోగ్య సురక్షపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కురుపాం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు.. దేవాదాయ చట్ట సవరణను ఆమోదించారు.