కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. రాహుల్ పూర్వీకులు తాము యాక్సిడెంటల్ హిందువులమని చెప్పుకునేవారని అంటూ గాంతంలో తొలి ప్రధాని, రాహుల్ తాత జవహర్ లాల్ నెహ్రు చెప్పిన మాటలను యోగి గుర్తు చేశారు.
గతంలో ప్రాతినిధ్యం వహించి, గత ఎన్నికలలో రాహుల్ గాంధీ ఓటమి చెందిన ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాహుల్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ తనను తాను హిందువునని ఎప్పటికీ చెప్పుకోలేరని యోగి స్పష్టం చేశారు.
రాహుల్ కేరళకు వెళ్లి అమేథీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, విదేశాలకు వెళ్లి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడతారని ఆయన విమర్శించారు. రాహుల్లా కాకుండా హిందువులమని గర్వంగా చెప్పాలని పేర్కొన్నారు. ఎన్నికల పర్యటనల తర్వాత రాహుల్ గాంధీ మాయమైపోతుంటారని యోగి జోస్యం చెప్పారు.
రాహుల్ గాంధీకి గుడిలో ఎలా కూర్చోవాలో కూడా తెలియదని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. గాంధీ సందర్శించిన ఆలయ పూజారి ఆయనకు ఎలా కూర్చోవాలో నేర్పించాలని హితవు చెప్పారు.
ఆయన (గాంధీ)కి హిందూయిజం లేదా ‘హిందూత్వ’ అంటే ఏమిటో తెలియదని, ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలను కూడా ఈ సందర్భంగా లక్ష్యంగా చేసుకొంటూ ఈ రెండు పార్టీల నుండి లేదా కాంగ్రెస్ నుండి ఎవరూ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదని, అయితే వారు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారని తెలిపారు. ఎన్నికలు ముగిశాక నాలుగున్నరేళ్లకు అవి కనిపించకుండా పోతాయని, మళ్లీ కనిపించబోరని సీఎం స్పష్టం చేశారు.