భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. నిజ్జర్‌ను కెనడా భూభాగంలో భారత్ హత్య చేసిందని కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కెనడా ఆరోపణలు అన్ని రాజకీయ ప్రేరేపిత ఆరోపణలే అని భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదులు, అతివాదులకు కెనడా సురక్షిత స్వర్గథామంగా మారిందని దుయ్యబట్టింది. ఇక భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్ల వీసా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయలేక పోతున్నామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.
తమకు ఎలాంటి నిర్ధిష్ట సమాచారం అందించినా పరిశీలించేందుకు సిద్ధమని చెప్పామని, ఇప్పటివరకూ కెనడా నుంచి నిర్ధిష్ట సమాచారం, ఆధారాలు అందలేదని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. కెనడా భూభాగం నుంచి వ్యక్తుల నేర కార్యకలాపాలకు సంబంధించి తమవైపు నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని కెనడాతో పంచుకున్నామని చెప్పారు.
ఈ సమాచారం ఆధారంగా కెనడా ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కోణంలోనే కెనడా ఈ ఆరోపణలు చేసిందని బాగ్చి వ్యాఖ్యానించారు. హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ఆరోపణల అనంతరం భారత్-కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించగా, కెనడాలో వీసా సర్వీసులను భారత్ నిలిపివేసింది.
ఇలా ఉండగా, భారత్-కెనడాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనతో కెనడాలో నివసించే పౌరుల్లో ఆందోళన నెలకొందని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, ఎంపీ సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. కెనడాలో నివసించే వారిలో పెరుగుతున్న భయాందోళనలను నివారించేందుకు కెనడాతో స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పడంలో చొరవ చూపాలని బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన బాదల్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
