టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈనెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
మరోవంక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం జైలులోనే విచారణ చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
కాగా, బుధవారం మధ్యాహ్నం వరకూ వాదలు జరిగాయి. ఆ రోజు సాయంత్రం తీర్పు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ జడ్జి గురువారం ఉదయానికి వాయిదా వేశారు. తర్వతా సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్పై తీర్పు రావాల్సి ఉన్నందున మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
శుక్రవారం ఉదయం పదిన్నరకు న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చే ఛాన్స్ ఉందన్న న్యాయవాదులు చెప్పడంతో 2.30కి తీర్పును వాయిదా వేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు కూడా సీఐడీ కస్టడీపై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది.
ఒకే రోజు రెండు వ్యతిరేక తీర్పులు రావడం టిడిపి శ్రేణులు నిరాశ చెందాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు ఎటు మళ్ళించారనే దానిపై విచారించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వెలుగులోకి వస్తాయని ఏసీబీ కోర్టుకు సీఐడీ తరుపున న్యాయవాదులు విన్నవించారు.
దీంతో సీఐడీ తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. చంద్రబాబును రెండు రోజులు పాటు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు విచారణ సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించిన కూడదని హెచ్చరించింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.