మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైకోర్టు ఆదేశాలతో టాలీవుడ్ నటుడు నవదీ్‌పకు నోటీసులు జారీ చేశారు. సెంట్రల్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న టీ న్యాబ్ కార్యాలయంలో నవదీప్ శనివారం విచారణకు హాజరయ్యారు.
టీ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి, ఏసీపీ నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ రాజేష్ బృందం నవదీ్‌పను విచారించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో నవదీ్‌పకు తన స్నేహితుడు రామ్‌చంద్‌తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డికి, రామ్‌చంద్‌కు మధ్య ఉన్న పరిచయంపై కూడా పోలీసులు వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరితో నవదీ్‌పకు ఉన్న లింకులు కూడా పోలీసుల విచారణలో బయటపడ్డట్లు విశ్వసనీయంగా తెలిసింది. నవదీ్‌పను ప్రశ్నించిన క్రమంలో 81 మంది అనుమానితుల గురించి తెలిసిందని, వారిలో ఎంతమందికి ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నది అనేది తేలాల్సి ఉందని ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు.
వీరిలో చాలా మంది నవదీప్ స్నేహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారని తెలిపారు. విచారణకు హాజరుకావటానికి ముందు నవదీప్ తన మొబైల్ ఫోన్లో డేటాను డిలీట్ చేశారని, దాంతో ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మరోసారి నోటీసులు ఇచ్చి నవదీ్‌పను ప్రశ్నిస్తామని సునీతారెడ్డి తెలిపారు.
విచారణ అనంతరం మీడియాతో నవదీప్ మాట్లాడుతూ గతంలో తాను నిర్వహించిన బీపీఎం పబ్ గురించి అడిగారని, కొన్ని నెలల క్రితమే ఆ పబ్‌ను మూసివేసినట్లు చెప్పానని పేర్కొన్నారు. అనేక కాంటాక్టులు, కాల్ లిస్టులు, పబ్‌ల నిర్వహణ వంటి అంశాలలో వివరాలు సేకరించి విచారణ సమయంలో తన ముందు పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
నవదీప్ బాటలోనే ముందస్తు బెయుల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కలహర్‌రెడ్డి, స్నాట్ పబ్ యజమాని సూర్య, రవి ఉప్పలపాటి ఈనెల 25న టీ న్యాబ్ ముందు విచారణకు హాజరుకానున్నారు. వారిని విచారిస్తే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని టీ న్యాబ్ అధికారులు భావిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులకు చిక్కిన కలహర్‌రెడ్డి తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు సమాచారం.