ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆదివారంనాడు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా రైళ్లను అనుసంధానించే లక్ష్యంలో భాగంగా ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వేగం, మౌలిక వసతుల కల్పనల సమతూకంతో ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. వందేభారత్ రైళ్లకు ప్రజాదరణ పెరుగుతోందని, ఒక కోటి 11 లక్షల మంది ప్రయాణికులు ఇప్పటికే ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారని ప్రధాని తెలిపారు.
ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు నడుస్తున్నానని, ఇప్పుడు మరో 9 రైళ్లు ప్రవేశపెడుతున్నామని చెబుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ రైళ్లు అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.
”గత చాలా సంవత్సరాలుగా పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి కాలేదనే విషయం మన అందరికీ తెలుసు. ఆయా స్టేషన్ల అభివృద్ధి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆజాదీకీ అమృత్కాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. వీటిని అమృత్ భారత్ స్టేషన్లుగా పిలుస్తున్నాం” ప్రధాని తెలిపారు.
కాగా, కొత్తగా ప్రవేశపెట్టిన 9 రైళ్లు 11 రాష్ట్రాలను అనుసంధానిస్తూ రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా పర్యాటకరంగ అభివృద్ధి మోదీ ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.
కొత్త రైళ్లు ఇవే
కొత్తగా ప్రవేశపెట్టిన తొమ్మిది రైళ్లలో ఉదయపూర్- జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్, తిరునల్వేలి- మదురై- చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్- బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్, విజయవాడ- చెన్నై (వయా రేణిగుంట) వందే భారత్ ఎక్స్ప్రెస్, పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్, కాసరగాడ్- తిరునల్వేలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి.
కాగా, రూర్కెలా- భువనేశ్వర్- పూరి వందేభారత్ ఎక్స్ప్రెస్, రాంచీ-హౌరా వందేభారత్ ఎక్స్ప్రెస్, జామ్నగర్- అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఇవి…రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖాండ్, గుజరాత్ సహా 11 రాష్ట్రాల మధ్య నడుస్తాయి.