జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ దఫా యాత్ర నిర్వహిస్తారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది. పూర్తి షెడ్యూల్ ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు.దాదాపు నెల రోజులుగా పవన్ కళ్యాన్ పొలిటికల్ యాక్టివిటీ లేదు. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన పొత్తుతో పోటీ చేస్తాయని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా సంచలన ప్రకటన చేసిన అనంతరం ఈ యాత్ర జరుగుతూ ఉండడంతో కీలక ప్రాధాన్యత లభించనుంది.
వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక చంద్రబాబు కి బెయిల్ కూడా రాకుండా రిమాండ్ పొడిగిస్తున్న నేపథ్యంలో ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయ యాత్రను నిర్వహించాలని రెడీ అయ్యారు.
మూడు సినిమాల షూటింగ్ ఏకకాలంలో పూర్తి చేసేందుకు పవన్ శ్రమిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలోనే ఆయన విజయవాడ వచ్చేందుకు సిద్ధమయ్యారు. పవన్ విమానానికి అనుమతులు ఇవ్వకపోవడంతో రోడ్డు మార్గంలో తరలి వచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో పవన్ అడ్డుకోవడంతో హైడ్రామా నడుమ మంగళగిరి వెళ్లాల్సి వచ్చింది. బాబుకు సంఘీభావం ప్రకటించిన పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. 14వ తేదీన రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. సినిమా షెడ్యూల్స్ కొలిక్కి రావడంతో వారాహిని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.