గల్వాన్ లోయలో గత ఏడాది భారత సైనికుల చేతిలో చావుదెబ్బ తిన్న చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను మాత్రం మార్చుకోవడం లేదు. రెండు దేశాల మధ్య సైనికుల స్థాయిలో పలు సార్లు చర్చలు జరిగినా ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ తమ సేనలను వెనుకకు మళ్లించడం గురించి మాట్లాడటం లేదు. గత ఆగష్టు నుండి చర్చలు కూడా జరగడం లేదు.
తాజాగా, జనవరి 1న నూతన సంవత్సరం రోజున గల్వాన్‌లో ఏకంగా తమ జెండాను ఎగురవేసి కవ్వింపు చర్యలకు పాల్పయింది. రెండు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్న రోజుననే ఈ దుశ్చర్యకు దిగడం గమనార్హం. ఇంకో వైపు, లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సులో చైనా వంతెనను నిర్మిస్తోంది
పైగా, జెండా ఎగరవేయడంపై ఒక వీడియోను చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఒక అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదంటూ ఆ వీడియోకు కాప్షన్‌ను జత చేసింది. కొత్త సంవత్సరంలో గల్వాన్ లోయలో చైనా పతాకం ఎగరడం చాలా ప్రత్యేకమంటూ చైనా ప్రభుత్వ మీడియా సంస్థ ప్రతినిధి షెన్ షివెయ్ ట్వీట్ చేశారు. భారత్ ఆధీనంలోని భూభాగంలోనే ఈ జెండా ఎగురవేసిన్నట్లు సంకేతం ఇచ్చారు.
అయితే ఈ వాదనను భారత సైన్యం ఖండించింది. ఆ భూభాగం చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతమే అని స్పష్టం చేసింది. ఇదే అవకాశంగా తీసుకొని, గల్వాన్‌లో చైనా ఆక్రమణలపై ప్రధాని మౌనాన్ని వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘‘గల్వాన్‌లో మన తిరంగ జెండా బాగుంటుంది. చైనాకు సమాధానం ఇవ్వాలి. మోదీజీ.. నిశ్శబ్దాన్ని వీడండి’’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
పాంగాంగ్ సరస్సులో వంతెన
మరోవైపు తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సులో చైనా వంతెనను నిర్మిస్తోంది. ఇటువైపు తీరానికి సైనికులను, భారీ ఆయుధాలను వేగంగా తరలించేందుకు వీలుగా ఈ వంతెనను బీజింగ్ నిర్మిస్తోందని అంతర్జాతీయ నిఘా నిపుణులు డేమియన్ సైమన్ ట్విటర్లో పేర్కొన్నారు. వంతెన నిర్మాణం, దాదాపు పూర్తయిందని ఆయన తెలిపారు. గత ఏడాది భారత సైనికులు సరస్సుకు దక్షిణ తీరం వైపున కైలాశ్ పర్వత శ్రేణిపైకి చేరుకుని చైనా బలగాలపై వ్యూహాత్మక పైచేయి సాధించారు.
ఈ నేపథ్యంలోనే సైనికుల్ని వేగంగా మోహరించే సౌలభ్యం కోసం చైనా వంతెనను నిర్మిస్తోంది. చైనా అధీనంలోని ఖురాంక్ నుంచి సరస్సు దక్షిణ తీరానికి వచ్చే దూరం ఈ వారధి వల్ల 180 కిలోమీటర్ల 50 కిలోమీటర్లకు తగ్గనుంది.
ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లో, వాస్తవావాధీన రేఖ వెంబడి, పాక్‌లోని గ్వాదర్ పోర్టులో చైనా తిష్ట వేసింది. ఇక శ్రీలంకలోనూ డ్రాగన్ బలగాలను మోహరిస్తే భారత్‌కు అన్ని వైపుల నుంచీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో.. శ్రీలంకలో పాగా వేసేందుకు ఉన్న అన్ని దారులనూ వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది.
శ్రీలంకతో ట్రింకోమలీ ఒప్పందం
ఆ క్రమంలో కీలకంగా మారింది ట్రింకోమలీ ఒప్పందం. తమ దేశంలోని ట్రింకోమలీ చమురు ట్యాంకుల అభివృద్ధిలో భారత్‌కు చెందిన లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఓసీ)కి 49శాతం వాటా ఇవ్వనున్నట్లు శ్రీలంక ఇంధన మంత్రి ఉదయ గమ్మనపిల గత వారం ప్రకటించారు.
తాజా ఒప్పందం వలన ట్రింకోమలీలోనే ఉన్న ‘చైనా బే’పై భారత్ ఓ కన్నేసి ఉంచవచ్చు. చైనా వాణిజ్య నౌకలు అధికంగా నడిచే ప్రాంతమది. దీంతో.. భారత్‌కు ట్రింకోమలీ పోర్టు వ్యూహాత్మక అవసరంగా మారింది. ఈ పోర్టు చెన్నైకు చాలా దగ్గరగా ఉండటం మరో సానుకూలాంశం.
ఒప్పందంలో అధిక వాటా(51శాతం) సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్‌దే(సీపీసీ) అయినప్పటికీ.. అభివృద్ధికి అవసరమైన మొత్తాన్ని భారత్ సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. అంగీకారాన్ని అమలుచేసేందుకు ప్రత్యేకంగా ట్రింకో పెట్రోలియం టెర్మినల్స్ లిమిటెడ్ అనే సంస్థను సీసీపీ ప్రారంభించింది. దానికి ఈ వారంలోనే లంక కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది.
ట్రింకోమలీలో ఉన్న 99 ఇంధన ట్యాంకులకు గాను ఇరు దేశాలు సంయుక్తంగా 61 ట్యాంకులను అభివృద్ధి చేస్తాయి. మిగిలిన వాటిలో 24 ట్యాంకులను సీపీసీ, 14 ట్యాంకులను ఎల్ఐఓసీ అభివృద్ధి చేయనున్నాయి. వచ్చే 50 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
తర్వాతి దశలో భాగంగా సీపీసీ, ఎల్ఐఓసీ మధ్య రెండు ఒప్పందాలు, శ్రీలంక ప్రభుత్వం-ఎల్ఐఓసీ మధ్య ఒక ఒప్పందం జరగాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 35 ఏళ్ల క్రితం ఇరు దేశాలు లేఖల ద్వారా సూచనప్రాయంగా అంగీకరించిన ఒప్పందం త్వరలోనే అమలులోకి వస్తుంది.
1987, జూలై 29న అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ, శ్రీలంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనేలు ఇందుకు అంగీకరించారు. అయితే.. లంకలో తొలుత 15 ఏళ్లపాటు అంతర్యుద్ధం కారణంగా, ఆ తర్వాత 20 ఏళ్లపాటు రాజకీయాల కారణంగా ఇన్నాళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ట్రింకోలో మరీ ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు తొలుత సుముఖంగా లేని భారత్, 2010లో హంబన్‌టోటా పోర్టులోకి చైనా ప్రవేశించగానే అప్రమత్తమైంది.
ప్రధాని మోదీ 2015 మార్చిలో శ్రీలంకలో పర్యటించి, ట్రింకోమలీలో సంయుక్తంగా పెట్రోలియం హబ్‌ను ప్రారంభించాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పర్యాటకమే ప్రధాన ఆదాయవనరుగా కలిగిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై, కరోనా మహమ్మారి పెను ప్రభావాన్నే చూపింది.
తనను ఆదుకుంటుందనుకున్న చైనా, గత ఏడాది అక్టోబరులో నకిలీ పురుగుమందులను సరఫరా చేయడమే కాక.. ఆ దిగుమతుల్ని తీసుకోకపోతే ఆర్బిట్రేషన్‌కు వెళ్తామంటూ బెదిరించింది. ఈ క్రమంలో దేశ ఆర్థికమంత్రి బసిల్ రాజపక్స హుటాహుటిన భారత్‌కు చేరుకుని ఆర్థిక సాయాన్ని అర్థించారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని భారత్ సమర్థంగా వినియోగించుకుని, వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది.