బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. డిల్లీ లిక్కర్ కేసులో కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసింది.
అక్టోబర్ 18న పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. ఈ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై విచారణ చేపడతామని పేర్కొంటూ అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నారనేది పక్కనబెడితే అసలు విచారణకు పిలవద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. అయితే మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసినట్లు తెలిపారు.
డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. నళిని చిదంబరం కేసులో మాదిరి ఉపశమనం కోరుతున్నానని ఆమె పెర్కోన్నారు. మహిళల విచారణకు సంబంధించిన మార్గదర్శకాలపై కూడా కవిత స్పష్టత చేయాలని కోర్టును కోరారు.
సెప్టెంబర్ 15న జరిగిన విచారణలో కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజులు గడువు కావాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణకు హాజరు కావాలని కవితకు ఇచ్చిన నోటీసులను కూడా పది రోజులు వాయిదా వేశారు. గడువు పూర్తి కావడంతో జడ్జి సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం మంగళవారం పిటిషన్ పై విచారణ జరిపింది.