అయోధ్య రామాలయ మూడంతస్తుల నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. జనవరి 22న పవిత్రోత్సవం జరగనుందని తేలిపారు. జనవరి 20-24 మధ్య ఏదైనా రోజున ‘ప్రాణ్ ప్రతిష్ఠ’కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తుది తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయాల్సి ఉందని ఆయన చెప్పారు.
ఏటా శ్రీరామనవమి రోజున గర్భాలయం లోని దేవతా విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారని చెప్పారు. బెంగళూరులో శిఖర నిర్మాణం జరుగుతోందని, దీనికోసం రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్, పుణె లోని మరో ఇన్స్టిట్యూట్ కలిసి కంప్యూటరైజ్డ్ ప్రోగ్రాం రూపకల్పన చేస్తున్నారని చెప్పారు.
ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి ప్రధాని మోదీని లాంఛనంగా శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించనుంది. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించాలని, రామ్ లల్లా ‘ప్రాణ ప్రతిష్ఠ’ (పవిత్ర ప్రతిష్ఠాపన)ను 10 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది.
రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత జనవరి 24న అయోధ్యలోని రామాలయాన్ని భక్తుల కోసం తెరిచే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యుడు మిశ్రా జూన్‌లో తెలిపారు. “వచ్చే ఏడాది జనవరి 22న వేడుక జరగనుండగా, భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లు, గ్రామాల నుండి (టెలివిజన్ ప్రసారం ద్వారా) దీనిని చూడాలని ట్రస్ట్ కోరింది” అని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ తెలిపారు.
ఆలయ నిర్మాణం మరియు నిర్మాణ సామగ్రిపై, మిశ్రా మాట్లాడుతూ, దాని నిర్మాణంలో ఇనుము ఉపయోగించబడలేదు మరియు రాతి బ్లాకులను అనుసంధానించడానికి రాగిని ఉపయోగించారు. ఆలయ నిర్మిత విస్తీర్ణం 2.5 ఎకరాలు, ‘పరిక్రమ మార్గం’ కూడా కలిపితే కాంప్లెక్స్ మొత్తం దాదాపు ఎనిమిది ఎకరాలు ఉంటుందని తెలిపారు.
తొంభై కాంస్య పలకలు రాముడి జీవితం, విధులను వర్ణిస్తాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ. 900 కోట్లు ఖర్చు చేశామని, కాంప్లెక్స్ మొత్తం నిర్మాణానికి రూ. 1,700 కోట్ల నుండి రూ. 1,800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు .