హుజూరాబాద్‌లో ఓడిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసిక సమతుల్యతను కోల్పోయారని అంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఘాటుగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ జరపడానికి కరోనా నిబంధనల పేరుతో పోలీసులు అనుమతి ఇవ్వక పోవ్వక పోవడంతో సికింద్రాబాద్ లో గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, నిరసన వ్యక్తం చేసి పార్టీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సంజయ్ విడుదల కోసం తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. తెలంగాణలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని విమర్శించారు.
తెలంగాణలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జీవో 317 తెచ్చారని తెలుపుతూ జీవోకు వ్యతిరేకంగా శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని, దేశంలో అత్యంత అవినీతికర రాష్ట్రంగా తెలంగాణను మార్చారని నడ్డా దుయ్యబట్టారు.
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ ప్రభుత్వం కలవరపడుతూ ఆందోళన చెందుతోందని ఆయన వివరించారు. నైరాశ్యంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అమానవీయ, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని నడ్డా దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి అవమానకర, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదని కేసీఆర్ తెలుసుకోవాలని తేల్చి చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతిచ్చేందుకు వచ్చానని, ప్రజల తరపున బీజేపీ నిరంతరం పోరాడుతుందని నడ్డా చెప్పారు. అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన తర్వాతే బీజేపీ విశ్రమిస్తుందని హెచ్చరించారు.
అంతకు ముందు, సంజయ్ అరెస్ట్‌కు నిరసనగాజేపీ నడ్డా సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, ఇతర బీజేపీ నేతలు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని తరుణ్ ఛుగ్ డిమాండ్ చేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా క్యాండిల్ ర్యాలీ లేదని కిషన్ రెడ్డి తెలిపారు. తొలుత శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద విలేకరులతో మాట్లాడిన నడ్డా తన ప్రజాస్వామ్య హక్కులను ఎవ్వరూ హరించలేరని చెప్పారు.
ఎయిర్‌పోర్టులోనే తెలంగాణ బిజెపి నేతలతో నడ్డా సమావేశమయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, డాక్టర్ కె లక్ష్మణ్, డికె అరుణ, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, రామచంద్రరావు, కానం వెంకటేశ్వర్లు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చించారు.