ఖలిస్థాన్ ముఠాలు, ఉగ్రవాదులపై దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. వీరిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా దేశవ్యాప్తంగా బుధవారం 50 ప్రాంతాల్లో సోదాలకు దిగింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఎన్ సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు నిర్వహిస్తోంది.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ఆరోపించిన తర్వాత కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు మరింత చురుగ్గా మారడం తెలిసిందే. ఖలిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య అనుబంధానికి సంబంధించిన కీలక సమాచారం ఎన్ఐఏకి అందినట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలుగ్యాంగ్స్టర్ల నుంచి హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నాయని, వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్ఐఎ వర్గాలు వెల్లడించాయి. వీరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపిఎ కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.
విదేశాల నుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాదులకు నిధుల సాయం, ఆయుధాల సరఫరాకు సంబంధించిన సమాచారం ఎన్ఐఏకి అందినట్టు తెలిసింది. దీంతో పంజాబ్ లోని 30 ప్రాంతాల్లో, రాజస్థాన్ లోని 13 ప్రాంతాల్లో, హర్యానాలో నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం.
ఈ ముఠాలు కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం, ఆయుధాల స్మగ్లింగ్, దోపిడీ, హత్యలు, ప్రభుత్వ భవనాలపై దాడులు వంటి చర్యలు చేపడుతున్నట్టు ఎన్ఐఏకి సమాచారం అందింది. దీంతో ఆయా ముఠాలను ఏరిపారేయడానికి ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే భారత్ నుంచి పారిపోయి యూకే, కెనడా, దుబాయ్, పాకిస్థాన్ ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న 19 మంది ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. దీంతోపాటు హర్విందర్ సింగ్ సంధు, లక్బిర్ సింగ్ సంధు పేరిట రూ. 10 లక్షలు చొప్పున రివార్డును కూడా ప్రకటించింది. వీరికి జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయి.