భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతూనే ఉంది. తాజాగా, ప్రస్తుత సంవత్సరంలో అన్ని రకాల వీసాలు కలిపి మిలియన్ (పది లక్షలు) వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
“భారత్లో ఈ ఏడాది వీసాల ప్రక్రియలో మేం పెట్టుకున్న మిలియన్ వీసాల జారీ లక్ష్యాన్ని దాటేశాం. అయితే, ఇక్కడితో మేం ఆగిపోం. రాబోయే నెలల్లో మరింత వృద్ధి సాధిస్తాం. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తాం” అని అమెరికా రాయబార కార్యాలయం తమ పోస్టులో పేర్కొంది. దీనికి ఓ వీడియోను కూడా జత చేసింది.
ఈ సందర్భంగా భారత్కు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆ వీడియోలో మాట్లాడుతూఈ రికార్డు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. “మా ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బంధం మాది. మా రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. ఈ బంధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రాబోయే రోజుల్లో మరింత మంది భారీయులకు రికార్డు స్థాయిలో వీసాలు అందజేస్తాము” అని వివరించారు.
కాగా, 2022 ఏడాది మొత్తంలో జారీ చేసిన వీసాలను మించి ఈ ఏడాది ఇప్పటికే వీసాలు జారీ అయ్యాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. 2019తో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ అని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా ప్రపంచ వ్యాప్తంగా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే దక్కడం గమనార్హం. విద్యార్థి వీసాల్లో 20 శాతం, హెచ్.ఎల్ కేటగిరి ఉద్యోగ వీసాల్లో 65 శాతం భారతీయులకు జారీ అయ్యాయి. ప్రపంచంలో భారతీయులు ఎక్కువగా నివసించేది అమెరికానే కావడం గమనార్హం.