మణిపూర్ రాజధాని ఇంఫాల్ సరిహద్దులోని ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. భద్రతా బలగాలు గాల్లోకి తుపాకీ కాల్పులు జరపటంతో దుండగుల గుంపు అక్కడ్నుంచి వెళ్లిపోయిందని సమాచారం. సీఎం పూర్వీకుల ఇల్లు ఖాళీగా ఉందని, అందులో ఎవ్వరూ నివసించటం లేదని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
ఇంటి చుట్టూ నిరంతరం పోలీసు పహారా ఉందని తెలిపారు. లోయలో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ ఈ దాడి జరగటం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. గుంపును పోలీసులు చెదరగొట్టారని తెలిపారు. మరోవైపు, ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యపై మణిపూర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి.
ఆందోళనకారులు గురువారం ఉదయం పశ్చిమ ఇంఫాల్‌లో డిప్యూటీ కమిషనర్ (కలెక్టర్) కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. అక్కడున్న రెండు ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. రాష్ట్ర సర్కార్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్న విద్యార్థుల గుంపు ఒకటి తౌబాల్ జిల్లాలో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్ర హోంశాఖ రంగంలోకి దింపింది. 2019 పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తు బృందంలో ఒకరైన రాకేశ్ బల్వాల్ను మణిపూర్ క్యాడర్‌కు మార్చుతూ కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టకముందు, ఆయన మూడున్నరేండ్లు ఎన్ఐఏలో ఉన్నారు.
హత్యకు గురైన విద్యార్థుల మృతదేహాల్ని పోలీసులు గుర్తించకపోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కనీసం తమ పిల్లల అవశేషాలనైనా గుర్తించి అప్పగిస్తే.. తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు మణిపూర్ హింసను పరిష్కరించే ఉద్దేశం బీజేపీ కేంద్ర నాయకులకు లేదంటూ ప్రముఖ మణిపూర్ నటుడు రాజ్‌కుమార్ సోమేంద్ర ఆ పార్టీకి రాజీనామా చేశారు.