పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది.
అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చినా మహిళా రిజర్వేషన్ ఎప్పటి నుంచి అమలవుతుందన్న సందిగ్ధత నెలకొనివుంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో పొందుపరచడమే సందిగ్ధతకు కారణం.
జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సివుంది. కోవిడ్ కారణంగా 2021 జనాభా లెక్కలు వాయిదా వేయడంతో ఈ విషయంలో ఇప్పటికీ గందరగోళం నెలకొన్న సంగతి విదితమే. 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాభా గణన
ప్రక్రియ మళ్లీ ప్రారంభమైనా, అది పూర్తి కావడానికి కనీసం రెండు మూడేళ్లు సమయం పడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా ఏళ్ల తరబడి జరిగే ప్రక్రియ. అందువల్ల మహిళా రిజర్వేషన్ చట్టం రూపం దాల్చినా అమలు కోసం 2029 ఎన్నికల వరకూ వేచి చూడాలి.
‘నారీశక్తి వందన్ ఆదినియమ్’ పేరిట రూపొందించిన ఈ బిల్లును ఇటీవల నిర్వహించిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభలూ ఆమోదించిన సంగతి తెలిసిందే. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసి) రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.