అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ద చూపని వైసిపి ప్రభుత్వం అకస్మాత్తుగా పలు చర్యలకు పాల్పడటం రాజకీయంగా కలకలం రేపుతున్నది.
మూడు రాజధానుల పేరుతో అమరావతిని `అరణ్య రోదన’గా మారి, సంవత్సరంకు పైగా ఆందోళన చేస్తున్న ఉచితంగా భూములిచ్చిన రైతులను పట్టించుకొనే ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా రాజధాని అమరావతిలోని 19 గ్రామ పంచాయతీలను కలిపి ‘అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ‘ పేరుతో ప్రత్యేక నగర పాలక సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకు రావడం పలువురికి విస్మయం కలిగిస్తున్నది.
కేవలం అమరావతి గ్రామాలలో విభజన తీసుకు రావడం కోసమే దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారని అంటూ ఆ ప్రాంత రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ పేరుతో హడావుడి ప్రారంభించింది.
తుళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలు, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలు కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది. ఈ 19 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో రాజధాని ప్రకటన సమయంలో ఉండవల్లి నుండి బోరుపాలెం వరకూ రాజధానిగా చూపించి దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాను వేశారని, ఇప్పుడు కాదంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే అన్ని గ్రామాలతోనూ కలిపి వేయాలని డిమాండు చేస్తున్నారు.
వాస్తవంగా సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ ఇచ్చిన మాస్టర్‌ప్లానులో 25 రెవెన్యూ గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీలో కొంత భాగం కలిపి ఉంది. మాస్టర్‌ప్లాను అమలు చేయాలంటే ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది. లేకపోతే మాస్టర్‌ప్లానుకు విలువ లేదని స్పష్టం చేస్తున్నారు.
మరోవంక, అమరావతి రాజధానిపై దాఖలైన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. వాటిపై స్టేట్‌సకో కొనసాగుతోంది. అదే సమయంలో, సాంకేతిక లోపాలు సరిదిద్దడానికి అంటూ మూడు రాజధానుల ప్రతిపాదనను, ఎపి సిఆర్డిఎ రద్దు బిల్లును ఉపసంహరించుకొంటున్నట్లు ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో ప్రకటన చేసి హైకోర్టుకు నివేదించింది. ఈ పరిస్థితుల్లో కొత్తగా అమరావతి కేపిటల్ సిటీ కార్పొరేషన్ ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
రాజధాని ఏర్పాటు, అభివఅద్ధి కోసం అప్పటి టిడిపి ఎపిసిఆర్‌డిఎను ఏర్పాటు చేసింది. గుంటూరు, కఅష్ణా జిల్లాల్లో దాని పరిధిని స్పష్టంగా పేర్కొని మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించింది. సిఆర్డిఎ పరిధిలోనే అమరావతి కేపిటల్ సిటీని స్పష్టంగా మార్కింగ్ చేశారు.
సిఆర్డిఎ చట్టాన్ని రద్దు చేయడంపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా స్టేట్‌సకో జారీ చేసి కొనసాగిస్తోంది. మరోవైపు గతేడాది మార్చి 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిని రైతులు పూర్తిగా విభేదించారు. ఆ సందర్భంలోనే అమరావతి రాజధాని నగరం నుంచి నిడమర్రు, నవులూరు, ఆత్మకూరు, యర్రబాలెం, బేతపూడి, ఉండవల్లి, పెనుమాక గ్రామాలను ప్రభుత్వం విడదీసింది. దీనిపైనా హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.
అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్లో చేర్చినట్లు గుంటూరు కలెక్టర్ వివేక్‌యాదవ్ డిసెంబరు 29నే ఆదేశాలు జారీచేసినా, గోప్యంగా ఉంచి, సోమవారమే గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రెవెన్యూ, పోలీసు శాఖల కనుసన్నల్లో సమావేశాలు నిర్వహించి తీర్మానాల నకళ్లతో పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించారు.
ఈ మధ్యనే అమరావతి అభివృద్ధికి అంటూ అప్పులకోసమై బయలుదేరిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూములు కొన్నినిటీని ఒకొక్క ఏడాది అమ్ముతూ అప్పులపై వడ్డీని, అసలును తీరుస్తామంటూ ప్రతిపాదనలు చేసింది. ఇదంతా స్పష్టమైన రాజకీయ వ్యూహంతోనే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనబడుతున్నది.