అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
\హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంగళ్లు ఘటనలో టీడీపీ నేతలకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది.
ఏపీ ప్రభుత్వం పిటిషన్పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అంగళ్లు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించాల్సిన పోలీసులే సాక్షులుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది.
పోలీసులు గాయపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. పోలీసులే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చింది కనుక ఆ విషయంలో జోక్యం చేసుకోడానికి ఏం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటషన్లను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారణకు జారీ చేసిన నోటీస్ పై నారా లోకేష్ హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై నేడు వాదనలు జరిగాయి. దానితో బుధవారం నాడు సిఐడి జరపాల్సిన విచారణకు బదులుగా ఈ నెల 10 వ తేదిన ఈ కేసు విచారణ కోసం సిఐడి అధికారుల ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు న్యాయవాది సమక్షంలోనే నారా లోకేష్ ను విచారించాలని సిఐడి అధికారులను ఆదేశించింది.