తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తెలంగాణలో రూ.8,021 కోట్ల విలువైన పనుల ప్రాజెక్టులను ప్రధాని నిజామాబాద్ నుండి మంగళవారం వర్చ్యువల్ గా ప్రారంభిస్తూ తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారం కాగా, ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా బీఆర్ఎస్ మార్చిందని విమర్శించారు.
రాష్ట్రం ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని పేర్కొంటూ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ధనికులయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని దేశమంతా తిరస్కరించిందని మోదీ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిలకు ముందు తనకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చేవారని గుర్తు చేస్తూ ఆ తర్వాత ఎందుకు రావడం లేదో కూడా ప్రధాని చాలా కాలం తర్వాత ఆ రహస్యం చెబుతున్నట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని పేర్కొంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని, తనపై ఎంత ప్రేమగా మాట్లాడారని, తన నేతృత్వంలో దేశం దూసుకెళ్తోందని చెప్పా రు. అంతప్రేమ కేసీఆర్ ఎప్పుడూ చూపలేదని అంటూ అంత ప్రేమ చూపడం కేసీఆర్ వ్యక్తిత్వంలోనే లేదని ఎద్దేవా చేశారు.
అంతేగాక, ఈ సందర్భంగా తాము ఎన్డీఏలో చేరతామని కేసీఆర్ తనతో ప్రతిపాదన చేశారని, అయితే, దాన్ని తాను తిరస్కరించినట్లు ప్రధాని చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పామని చెబుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకునేందుకు మద్దతు కోరారని తెలిపారు. అయితే, తాను అందుకు ఒప్పుకోలేదని, తెలంగాణ కోసం బీజేపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని స్పష్టం చేసినట్లు తెలిపారు.
కేటీఆర్కు తన ఆశీర్వాదం కావాలని కేసీఆర్ కోరారని, మీ ఆశీర్వాదం ఉంటే కేటీఆర్కు తెలంగాణలో పాలన బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. అయితే, కేసీఆర్ ప్రతిపాదనలకు తాను ఒప్పుకోలేదని అంటూ ఇది రాజరికం కాదని, ప్రజాస్వామ్యం అని కేసీఆర్ కు చెప్పినట్లు తెలిపారు. ప్రజలు ఆశీర్వదించినవారే పాలకులు అవుతారని చెప్పినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి తనను కేసీఆర్ కలవలేదని ప్రధాని మోదీ వివరించారు.
వందకు వందశాతం ఇక్కడ నిజం చెప్పడానికే వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ.. బీఆర్ఎస్ పార్టీతో కలిసేది లేదని చెప్పామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోసం బలంగా పోరడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
కాగా, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ కుటుంబ స్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.