అంతర్జాతీయ పరిణామాల కారణంగా చైనాను వదిలి భారత్ వైపు చూస్తున్న బహుళజాతి పారిశ్రామిక సంస్థలను బెదిరించే రీతిలో భారత్ లో వారితో సంబంధం ఏర్పర్చుకొనే కంపెనీలలో కార్మిక అశాంతి అస్త్రాన్ని చైనా ప్రయోగిస్తుందా? అవుననే నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
తమిళనాడులో బహుళజాతి కంపెనీలకు అతిపెద్ద సముదాయమైన శ్రీపెరంబూరు పారిశ్రామికవాడలోని పరిణామాలు అటువంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. ఆపిల్ ఇంక్ తమ సరఫరాదారుగా ఎంపిక చేసుకున్న చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద గల ఫాక్స్‌కాన్ కంపెనీలో ఇటీవల చెలరేగిన కార్మికుల అశాంతికి వామపక్ష కాంతిక సంఘాలకు చైనా అందిస్తున్న సహాయమే కారణమని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
కొంతమంది సిబ్బందికి అనారోగ్యాన్ని కలిగించే నాసిరకం క్యాంటీన్ ఆహారం కారణంగా మోకాలి నొప్పులు కలిగించేటట్లు చేయడం పారిశ్రామిక సంస్థలను అస్థిరపరిచే అంతర్జాతీయ ఎత్తుగడను సూచిస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ కంపెనీ పట్ల చైనాకు ఆగ్రహంతో ఉన్నదన్నది బహిరంగ రహస్యమే అని ఈ సందర్భంగా పారిశ్రమైక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదివరలో ఆపిల్ ఐఫోన్ కోసం 48 శాతం భాగాలు చైనాలో ఉత్పత్తి చేసేవారు. అయితే, అమెరికా – చైనా మధ ఏర్పడిన వాణిజ్యపరమైన వైరం కారణంగా తమపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఏర్పడడంతో ఇటీవల కాలంలో ఆపిల్ భారత్ లో తన కార్యకలాపాలను పెంచుతున్నది.
యాపిల్, ఇతర బహుళజాతి సాంకేతిక సంస్థలకు తయారీ ప్రత్యామ్నాయంగా భారతదేశం అభివృద్ధి చెందడం వల్ల అమెరికా – చైనా వాణిజ్య పోరులో చైనా సరఫరా గొలుసు చిక్కుకుపోవడం గమనార్హం.
ఫాక్స్‌కాన్ భారతదేశంలోని తైవాన్ కంపెనీలలో ఒకటి. ఈ జాబితాలో కర్ణాటకలోని నరసపురలో విస్ట్రోన్ ఇన్ఫోకామ్ తయారీ ఇండియా, చెన్నై సమీపంలోని మహీంద్రా సిటీలో పెగాట్రాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఇటీవల, విస్ట్రాన్ ఫ్యాక్టరీ లోపల కూడా దాడి, హింసాయుత సంఘటనలు చోటుచేసుకోవడంతో ఉత్పత్తి ఆగిపోయింది.
సన్మీనా, ఫోర్డ్, పీపీజీ ఏషియన్ పెయింట్స్, ఎన్ఫీల్డ్ ఇండియా లిమిటెడ్ వంటి బహుళజాతి కంపెనీల్లో సహితం ఇటువంటి అశాంతికార పరిస్థితులు నెలకొనడాన్ని ఈ సందర్భంగా నిఘా వర్గాలు గుర్తు గుర్తు చేస్తున్నాయి. అలాగే శ్రీపెరంబుదూర్‌లోని మరికొన్ని కంపెనీలలో కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి.
బహుళజాతి ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్‌కాన్ తమ ఆవరణలోకి కార్మిక సంఘాలను అనుమతించడం లేదని, యూనియన్ కార్యకలాపాలలో పాల్గొన్న వారికి ఉద్యోగ భద్రత లేదని కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. వామపక్ష ప్రభావితమైన పలు కార్మిక, యువజన, సామజిక సంఘాలు ఈ కర్మాగారాలలో అశాంతిని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఇలా ఉండగా, ఈ పరిశ్రమలో చెలరేగిన ఆందోళనలకు, దేశం వెలుపల ఉన్న వారితో గల సంబంధాలపై విచారణ జరుపుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు కూడా నిర్ధారించాయి. తమిళనాడు మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఫాక్స్‌కాన్ ఆవరణను సందర్శించిన తర్వాత, పని పరిస్థితులను మెరుగుపరచాలని తైవాన్ తయారీ కంపెనీని కోరింది.
ఉద్యోగులకు సరైన వాష్‌రూమ్‌లు, సరిపడా తాగునీరు, హాస్టల్లోని ప్రతి ఉద్యోగికి 50 చదరపు అడుగుల స్థలం, విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కోవడానికి ఇన్వర్టర్లు అందుబాటులో ఉంచాలని బృందం సిఫార్సు చేసింది. ప్రభుత్వం, ఈ సిఫార్సుల ఆధారంగా, ప్రతి ఉద్యోగికి రోజుకు కనీసం నాలుగు లీటర్ల తాగునీరు, అంటువ్యాధులను నివారించడానికి తగిన వాష్‌రూమ్‌లు, మహిళా ఉద్యోగులు ఉండే ప్రాంగణంలో సరైన ఫెన్సింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఫాక్స్‌కాన్‌ను కోరింది.
డిసెంబర్ 2014లో, ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను నిలిపివేయాలనే ప్రతిపాదనతో ముందుకు వచ్చినప్పుడు, అప్పటి ఫాక్స్‌కాన్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ నిరసనను ప్రారంభిస్తామని బెదిరించింది. 2014లో, నోకియాకు సంబంధించిన ప్రధాన హ్యాండ్సెట్ తయారీదారులలో ఫాక్స్‌కాన్ ఒకటి.
యాదృచ్ఛికంగా అదే సమయంలో, నోకియా హ్యాండ్సెట్ వ్యాపారాన్ని 7 బిలియన్ల డాలర్లకు పైగా కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ పన్ను వివాదం కారణంగా తన కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత శ్రీపెరంబుదూర్ పెద్ద కార్మిక అశాంతిని చూసింది. అంతకుముందు, ఫోర్డ్ చెన్నైలో తన ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకొని, భారత్ నుండి తరలిపోయింది.