క్యాసినో కింగ్ గా పేరొందిన చీకోటి ప్రవీణ్ శనివారం బర్కాత్ పూర్ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్యెల్సీ ఎన్. రాంచందర్ రావుల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు ఆయన గతంలోనే బీజేపీలో చేరాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.
ఆగస్ట్ నెలలో బీజేపీ పార్టీలో చేరేందుకు చీకోటి ప్రవీణ్ ఖర్మంఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తన అనుచరులు, అభిమానులతో భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ కార్యాలయం వరకు వచ్చారు. అయితే దేశవిదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్లు, క్యాసినోలను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ చేరిక పట్ల పార్టీలోని కొందరు ప్రముఖులు సుముఖంగా లేన్నట్లు తెలిసింది.
దానితో, పార్టీలో చేరేందుకు వచ్చిన చీకోటి నిరాశతో వెనుదిరిగారు. మరుసటి రోజు తన చేరికను కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని, అలాంటి వారికి తాను భయపడే వాడని కాదని తన అభిమానాలు ఎవ్వరూ నిరుత్సాహం చెందొద్దని ఓ వీడియో విడుదల చేశారు.
తన ఆవేదనను బిజెపి అగ్రనేతలకు వివరించగా, వారి జోక్యంతో రాష్త్ర నాయకత్వం ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తున్నది. కాగా హైదరబాద్ నుంచే ఏదో ఒక నియోజకవర్గం నుంచి చీకోటి పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది.