యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా క్షేమంగా ముంబైకి చేరుకున్నారు. హమాస్ మిలిటెంట్లు, ఇజ్జాయెల్ సైన్యానికి మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇజ్జాయెల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల నుష్రత్ బరూచా అక్కడికి వెళ్లారు. దీంతో ఆమె అక్కడే చిక్కుకున్నరాని వార్తలు వచ్చాయి.
అయితే, ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆమె ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు నుష్రత్ ఇజ్రాయెల్ కు వెళ్లారు.
ఈ క్రమంలోనే శనివారం ఆకస్మాత్తుగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ముప్పేటదాడికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రాకెట్లతో ఇరువైపుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి.
కాగా, ముంబై విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్న అనంతరం నుష్రత్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు కొంత సమయం కావాలని కోరారు. కాగా, అంతకుముందు ఇజ్రాయెల్‌లో ఉన్న సమయంలో నుష్రత్ కు ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.
తానొక బేస్మెంట్లో సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, శనివారం మధ్యాహ్నం నుంచి ఆమె ఫోన్ కు స్పందించకపోవడంతో వారు ఆందోళన చెందారు. భారత రాయబార కార్యాలయం సహాయంతో తాము ఆమెతో టచ్‌లోకి వచ్చామని ఆమె టీం తెలిపింది.
ఆమె సురక్షితంగా భారత్ చేరుకుంటుందని అయితే డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదని చెప్పింది. కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా ఆమె భారత్ చేరుకుంటుందని తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం మధ్యాహ్నం ముంబైకి సురక్షితంగా చేరుకున్నారు. కాగా, నుష్రత్ బరూచా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు.
తాజ్‌మహల్ సినిమాతో ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ప్యార్ కా పంచనామా, డ్రీమ్ గర్ల్, రామ్ సేతు, ఛత్రపతి, తదితర చిత్రాల్లో నటించారు.