హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం భీకరపోరు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
“ఇజ్రాయెల్హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి తాజా పరిస్థితుల గురించి నెతన్యాహు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు యావత్ భారతావని అండగా నిలుస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే. దాన్ని భారత్ నిస్సందేహంగా, తీవ్రంగా ఖండిస్తుంది” అని మోడీ ఎక్స్ (ట్విటర్ ) వేదికగా వెల్లడించారు.
తమ దేశంలోకి చొరబడి మారణహోమం సృష్టించిన హమాస్ మిలిటెంట్లను తుడిచి పెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. మరోవైపు తమ భూభాగం లోకి చొరబడిన దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడారు. తమ దేశంపై దాడి చేసి హమాస్ ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అన్నారు. తమ ప్రతిదాడి హమాస్‌తోపాటు, ఇజ్రాయెల్ శత్రు దేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు.
మరోవంక, ఇజ్రాయెల్‌కు అండదండలు ప్రకటించిన అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల సరసన బ్రిటన్ కూడా చేరింది. ఉత్తర లండన్ లో ప్రార్థనా మందిరంలో బ్రిటన్‌లోని యూదు సమాజంతో కలిసి సునాక్ ప్రార్థనలు చేశారు. ఆ తరువాత అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నేతలతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్ లో సాగుతున్న యుధ్ధ పరిస్థితిపై చర్చంచారు.
ఇజ్రాయెల్ లోని యూదు సమాజం భద్రతకు భరోసా ఇచ్చారు. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలోఫ్ స్కాల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలతో కలిసి సునాక్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్ సాగిస్తున్న భయంకర ఉగ్రవాద దాడులను ఏకగ్రీవంగా ఖండించాలని , ఇజ్రాయెల్‌కు సమైక్యంగా సంఘీభావం తెలియజేయాలని సునాక్ ప్రకటనలో పేర్కొన్నారు.
హమాస్ ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్ధన కానీ చట్టబద్ధత కానీ ఉండదని పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా దేశాన్ని , ప్రజలను రక్షించుకోడానికి ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రయత్నాలకు మన దేశాలన్నీ మద్దతు అందించాలని కోరారు. అలాగే హమాస్ దాడులను స్వప్రయోజనాలకు వినియోగించుకుని ఇజ్రాయెల్‌పై శత్రుత్వం వహించడానికి ఏ దేశానికైనా ఇది సమయం కాదని ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలను తాము తప్పక గుర్తిస్తామని, ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లకు సమానంగా న్యాయం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులకు సమాన మద్దతు అందిస్తామని ఐదు దేశాల నేతలు సంయుక్తంగా ప్రకటించారు.
అయితే ఈ విషయంలో పొరపాటు చేయరాదని, ఆ ఆకాంక్షలకు హమాస్ సరైన ప్రాతినిధ్యం కాదని, పాలస్తీనా ప్రజలకు రక్తపాతం, ఉగ్రవాదం తప్ప హమాస్ ఏమీ చేయలేదని ఐదు దేశాల నేతలు తమ ప్రకటనలో సూచించారు. రానున్న రోజుల్లో ఇజ్రాయెల్‌కు తాము మిత్రదేశాలుగా కొనసాగుతామని, సమైక్యంగా సమన్వయంతో అండదండలు అందిస్తామని ప్రకటించారు.