సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా విచ్చలవిడిగా ఎన్నికల హామీల వర్షం కురిపించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను అమలు పరచలేక తికమక పడుతున్నది. ముఖ్యంగా వ్యవసాయంపై నాణ్యమైన విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోతున్నది. ఎడాపెడా విద్యుత్ కోతలతో అన్నదాతల కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి.
గంటలకొద్దీ ఎడాపెడా విద్యుత్తు కోతలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇది తట్టుకోలేని అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. దీంతో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆ తర్వాత రైతును నిలువునా ముంచిందనే విమర్శలు వస్తున్నాయి.
కర్ణాటకలోని గుల్బర్గా, బళ్లారి తదితర ప్రాంతాల్లోని 216 తాలూకాల్లో వేలాది మంది రైతులకు వ్యవసాయానికి పంపు సెట్లే ఆధారం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనధికారింగా గంటలకొద్దీ విద్యుత్తు కోతలు విధిస్తున్నది. దీంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హామీ మేరకు కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కురుగోడు తాలూకా సింధిగేరి, బైలూరు, కగ్గల్, కల్లుకంభ, ముష్టగట్టి, కోళూరు బాదనహట్టి, వద్దట్టి తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు స్థానిక కురుగోడులోని గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (జెస్కాం) శాఖ కార్యాలయం ముందు సోమవారం ఆందోళనలు చేపట్టారు.
పావగడ తాలూకా రైతు నేతలు స్థానిక జెస్కాం కార్యాలయానికి నిరసన ర్యాలీ చేపట్టారు. ఎడాపెడా కరెంటు పంట నష్టంతోపాటు అప్పుల భారం కారణంగా హరపన హళ్లి తాలూకా జంగమతుంబిగెరెకు చెందిన బసవరాజ్, హొన్నాళి తాలూకా చిన్నికట్టేకు చెందిన నాగరాజ్, కడూరు తాలూకాలోని లింగదహళ్లికి చెందిన కృష్ణా నాయక్ గడిచిన గత రోజుల వ్యవధిలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఒక్క కడూరు తాలూకాలోనే గడిచిన 40 రోజుల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. గడిచిన 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొన్న అన్నదాతల సంఖ్య 1,219కి చేరినట్టు వివరించారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నప్పటికీ, అధికార కాంగ్రెస్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
విద్యుత్తు కోతలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే స్పందించి కోతలు లేని విద్యుత్తు సరఫరా చేయాలని, లేకుంటే, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు.