ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న తన సోదరి, ఆమె భర్తను వారి పిల్లల ముందే హమాస్ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపివేశారని బాలీవుడ్ నటి ఒకరు వెల్లడించారు. నాగిన్, ఉత్తరన్, బ్రీత్ వంటి వెబ్ సిరీస్, సీరియల్స్‌లో నటించిన మధురా నాయక్ తన సోదరిని హమాస్ ఉగ్రవాదులు దారుణంగా హత్యచేసిన ఉదంతాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
గత ఆదివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి జరిపారని, పట్టపగలు ఇంట్లో ఉన్న తన సోదరి ఉదయ, ఆమె భర్తను పిల్లల ముందే దారుణంగా చంపివేశారని ఆమె తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులనే లక్షంగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారని ఆమె పేర్కొన్నారు.
పిల్లల ముందే తన సోదరి ఉదయను, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆమె తెలిపారు. ఉగ్ర దాడిలో తన సోదరి, ఆమె భర్త మరణించడం తనను తీవ్ర విచారానికి గురిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
హమాస్ ఉగ్రవాదుల నిజస్వరూపం ఏమిటో, వారు ఎంత కిరాతకులో ప్రజలు అర్థం చేసుకోవలసిన సమయం ఇదని ఆమె తెలిపారు. తాను యూదురాలినైనందుకు విద్వేషాన్ని చవిచూడవలసి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
యూదురాలైనందుకు అవమానాలకు, విద్వేషానికి గురవుతున్నానని ఆమె తెలిపారు. ఇ్రజ్రాయిల్ ప్రజలను హంతకులుగా చిత్రీకరిస్తున్న పాలస్తీనా అరబ్ అనుకూల ప్రచారంలో ఎంతవరకు నిజముందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.
కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై కాగా, ఇజ్రాయెల్ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో తమ దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది.
ముఖ్యంగా గాజాపై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. గాజాలోని హమాస్ మిలిటెంట్ల ప్రధాన స్థావరాలపై వరుసగా క్షిపణులు, బాంబులతో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హమాస్ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దాడులు చేయనున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ తాజాగా ప్రకటించారు.
‘గాజా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించాం. అంతిమంగా హమాస్‌ను ఇజ్రాయెల్ ఏరిపారేస్తుంది. హమాస్ సీనియర్ సభ్యులను అంతమొందించడమే మా లక్ష్యం. మిలిటెంట్ల నియంత్రణలోని గాజా సరిహద్దు ప్రాంతాలను మా ఆధీనంలోకి తీసుకున్నాం. గాజా ఇకపై మునుపటి స్థితిలోకి వెళ్లడం అసాధ్యం. ఇందుకు హమాస్ విచారించడం ఖాయం. గాజాలో హమాస్ మార్పును కోరుకుంటోంది. అది అనుకున్న స్థితి నుంచి 180 డిగ్రీలు మారుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.