ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో రెండు దేశాల మధ్య కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది.
అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా రెండు రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ సమావేశమైనట్లు సమాచారం. బ్రిటీష్ వార్తాపత్రిక ఫెనాన్షియల్ టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని పేర్కొంది.
అయితే ఈ భేటీని ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ, అటు కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌తో దౌత్యపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కెనడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కూడా జరిగినట్లు అర్థమవుతోంది.
ఇప్పటికే మన దేశం డిమాండ్ చేసినట్లుగా ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకుంటున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పైగా ఈ నెల ప్రారంభంలో కెనడా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ సమస్యను ప్రైవేట్‌గా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
“మేము భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము. మేము మా దౌత్యవేత్తల భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటాము. ఈ వివాదం పరిష్కారం కోసం మేము ప్రైవేట్‌గా సమావేశం కావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే దౌత్యపరమైన సంభాషణలు ప్రైవేట్‌గా జరగడమే ఉత్తమమని మేము భావిస్తున్నాం.’’ అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ తెలిపారు.
అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారత్‌తో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా పెరగాలని తాము కోరుకోవడం లేదని ఇప్పటికే ప్రకటించారు. అలాగే న్యూఢిల్లీతో కెనడా బాధ్యతాయుతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ కోరినట్టుగా 30 మంది తమ దౌత్య వేత్తలను కెనడా ప్రభుత్వం కౌలాలంపూర్ లేదా సింగపూర్‌కు తరలించినట్లు ఆ దేశానికి చెందిన సీటీవీ న్యూస్ తెలిపింది.
ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత్, కెనడా నెలకొన్న వివాదం త్వరలోనే సద్దుమణిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే రెండు దేశాల మధ్య త్వరలోనే మళ్లీ దౌత్యపరమైన సంబంధాలు యథావిదిగా కొనసాగనున్నాయి.