వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని ఇటీవల వైసీపీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంగళవారం వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో జరిపిన భేటీలో “వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
దసరా తర్వాత ఈ నెల 26న బస్సు యాత్రలు మొదలుపెట్టాలని, ప్రతీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మూడు ప్రాంతాలలో ప్రతి రోజూ మూడు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. రానున్న రెండు నెలల పాటు వైసీపీ శ్రేణులు ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బస్సు యాత్ర సమావేశాల్లో ఎమ్మెల్యే, పార్టీ ఇన్ ఛార్జ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు మాట్లాడాలని తెలిపారు.
నాలుగన్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెబుతూ సామాజిక న్యాయం, మహిళా సాధికారిత అంశాలను నేతలు ప్రస్తావించాలని నేతలకు మార్గ నిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అవగాహన సమావేశాల నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశాల్లో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు హాజరవ్వాలని చెప్పారు. స్థానిక నేతలను సమన్వయం చేస్కుండా బస్సు యాత్రలను విజయవంతం చేయాలని సీఎం జగన్ సూచించారు. వైసీపీ బస్సు యాత్రల నిర్వహణ తేదీలు, సమావేశాలపై ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ ముఖ్యనేతలను ఆదేశించారు.
బస్సు యాత్రలను సమన్వయం చేసుకునేందుకు ప్రాంతాల వారీగా బాధ్యుల్ని నియమించారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల సానుకూలత, వ్యతిరేకతలేంటని సీఎం జగన్ ఆరా తీశారు. ప్రధానంగా గ్రూపులు, వర్గ విభేదాలపై చర్చించినట్లు తెలుస్తోంది.