తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరించెందుకు వీలుగా ఎన్నికల కమిషన్ భారీగా కసరత్తు చేస్తున్నది. తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు వేసింది. నలుగురు కలెక్టర్లపై ఈసీ బదిలీ చేసింది.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. గురువారం సాయంత్రం 5 గంటల కల్లా కొత్త ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పలువురు అధికారుల పనితీరుపై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అధికారుల పనితీరు, సంబంధిత ఇన్పుట్లను అంచనా వేసిన తర్వాత సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ధన బలాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందటంతో.. సీఈసీ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో 9 మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు కావటం గమనార్హం. ఇందులో ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేస్తున్నట్టు సీఈసీ ఆదేశించింది.
ఖమ్మం ఎస్పీ విష్ణువారియర్‌తో పాటు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సీఈసీ. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు కలెక్టర్లను కూడా బదిలీ చేసింది సీఈసీ.
నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, భువనగిరి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యదర్శి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది.
ఎన్నికల సమయంలో పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని వెంటనే నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఈసీ ఆదేశించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు నిర్వర్తించగా ఈసారి మాత్రం ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని ఆదేశించింది. కాగా, బదిలీ అయిన స్థానాల్లో కొత్తగా నియమించే ప్యానల్ లిస్టును గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు పంపాలని ఈసీ ఆదేశించింది.