కరోనా మహమ్మారి దెబ్బ నుంచి ప్రపంచం కోలుకోవాలి అన్న ఆశాభావం ఎంతగా వెల్లడి అవుతున్నా అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు లేవు. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వెల్లడించిన ప్రపంచ ఆర్థిక దృక్కోణం రానున్న రోజుల్లో ప్రపంచ ప్రగతి మరింత దిగజారనుందని జోస్యం చెప్పింది.
ఇతరత్రా అనేక మంది ఆర్థికవేత్తల విశ్లేషణలు, దేశాలు, ప్రాంతాల పని తీరును చూసినా అధోగతి తప్ప పురోగతి కనుచూపు మేరలో కనిపించటం లేదు. గత ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతం ఉండగా వర్తమానంలో మూడు, వచ్చే ఏడాది 2.9 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ చెప్పింది. రెండు వేల నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు 3.8 శాతం ఉంది.
అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఐరోపాలో పెద్ద దేశమైన జర్మనీ పురోగమనం సంగతి దేవుడెరుగు తిరోగమనం లోకి దిగజారుతుందా అన్న భయాలు ఉన్నాయి. ఇప్పటికే రోగిగా మారినట్లు వర్ణిస్తున్నారు.
ధనిక దేశాల వృద్ధి రేటు గతేడాది 2.6 శాతం ఉండగా ప్రస్తుత సంవత్సరంలో 1.5, వచ్చే ఏడాది 1.4 శాతానికి దిగజారుతుందని, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు 4.1 నుంచి నాలుగు శాతానికి తగ్గుతుందని అంచనా. ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉంటే అన్న ప్రాతిపదిక మీద చెప్పిన మాటలు. ఉక్రెయిన్ సంక్షోభం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.
ఐఎంఎఫ్ తాజా అంచనాలను రూపొందించే సమయానికి ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభం ఊహలో కూడా లేదు. అమెరికా తన ఆయుధ పరిశ్రమలకు లాభాలను సమకూర్చేందుకు ప్రపంచంలో ఎప్పుడు ఏ మూలన చిచ్చు పెడుతుందో, అది అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పలేము.
ఇటువంటి స్థితిలో ఎగుమతుల మీద ఆశలు పెట్టుకున్న మనవంటి దేశాల పరిస్థితి అగమ్యగోచరం, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎగుమతుల్లో మిగులు ఉన్న చైనాకు వాణిజ్య మిగులు తగ్గవచ్చు తప్ప ఇప్పటికిప్పుడు లోటులో పడే అవకాశం లేదు.
2022లో 8.7 శాతంగా ఉన్న ప్రపంచ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ 2024లో 5.8 ఉంటుందని అంచనా. ఇదేమీ తక్కువ కాదు. రెండు శాతానికి పరిమితం చేయాలన్న ప్రపంచ ద్రవ్యోల్బణ లక్ష్యం ఎప్పటికి నేరవేరుతుంది అన్నది ప్రశ్నే.
మన దేశంతో సహా అనేక దేశాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. అమెరికా విత్తలోటు 8 నుంచి వచ్చే ఏడాదికి 7.4 శాతానికి, ఐరోపాలో 3.4 నుంచి 2.7 శాతానికి తగ్గుతుందని చెబుతున్నారు. మరోసారి ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల సూచనలు కనిపిస్తున్నాయి.