ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి 235 మంది భారతీయులతో రెండవ విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తరలించిన భారతీయులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఈ ఆపరేషన్ కొనసాగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. “ఆపరేషన్ అజయ్ కొనసాగిస్తాం. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నవారికి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు.
రెండో విమానంలో ఎక్కువగా 135 మంది విద్యార్థులు, ఇద్దరు శిశువులు ఉన్నట్లు చెప్పారు. ఆ దేశం నుంచి తాము తిరిగి వస్తామో? లేదో?భయాలు నెలకొన్నాయని, అటువంటి సమయంలో భారత్ చేసిన ఆపరేషన్ తో తామంతా తిరిగి వచ్చామని, ఇందుకు కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.
ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ స్వదేశానికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను, ఆప్తులను చూసి వారంతా కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు విమానాశ్రయంలో కనిపించాయి.
అక్కడ భయంకర పరిస్థితులు నెలకొన్నాయని.. తాము ప్రాణాలపై ఆశ వదిలేసుకున్న టైంలో భారత ప్రభుత్వం తమ రక్షణ కోసం చర్యలు చేపట్టిందని మరో ప్రయాణికుడు అన్నాడు. ఇజ్రాయెల్ – పాలస్థీనా మధ్య ఉద్రిక్తతలు చల్లారేవరకు ఆపరేషన్ అజయ్ కొనసాగించాలని కోరాడు.
యుద్ధం కారణంగా షెల్టర్లలో తలదాచుకున్న భారతీయులను భారత ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ పేరిట అక్కడ నుంచి స్వదేశానికి తరలించే ఏర్పాటు చేపట్టింది. శుక్రవారం ఉదయం భారతీయులతో మొదటి విమానం ఇజ్రాయెల్ నుంచి 212 మందితో న్యూఢిల్లీ రాగా, రెండవ విమానం మరుసటి రోజు వచ్చింది. వీరిలో చాలామంది అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు, పరిశోధకులు.
రెండు విమానాలలో ఇప్పటి వరకు 247 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హర్షం వ్యక్తం చేశారు.