భార్య భర్తలు అయినా సరే వారిద్దరిలో ఎవరైనా ఒకరికి తెలియకుండా మరొకరు ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం మిగితా వారి హక్కులకు భంగం కలిగించడమేనని ఓ ఘటనలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తలైనా సరే ఎవరైనా ఒకరి ఫోన్ కాల్ మరొకరు తెలియకుండా మొబైల్ సంభాషణను రికార్డ్ చేయడం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కి విరుద్ధమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫ్యామిలీ కోర్టు భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, డబ్బులు ఇచ్చేందుకు తన భర్త నిరాకరించాడని ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.
భార్యకు భరణం చెల్లించాలని ఆ భర్తకు 2019 లోనే తీర్పు వెలువరిస్తూ మహాసముంద్ జిల్లాలోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆ మహిళ హైకోర్టు ముందుకు రావడంతో కేసు మొదటికి వచ్చింది. ఈ భరణం కేసును మళ్లీ విచారించాలని ఫ్యామిలీ కోర్టును మహిళ తండ్రి కోరారు.
ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడిన కాల్ రికార్డింగ్‌లు తన వద్ద ఉన్నాయని, వాటిని దానిని కోర్టు కూడా వినాలని భర్త విజ్ఞప్తి చేశాడు. 2021 అక్టోబర్ 21 వ తేదీన ఆ కాల్ రికార్డింగ్‌లను సమర్పించేందుకు ఫ్యామిలీ కోర్టు మహిళ భర్తకు అనుమతినిచ్చింది. దీంతో ఆ మహిళ 2022 లో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలోనే తన ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్ ద్వారా తన భార్య వ్యభిచారం చేస్తుందని భర్త నిరూపించాలనుకున్నాడు. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అందుకే విడాకులు ఇచ్చిన తర్వాత భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వాదించాడు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో విచారణ సందర్భంగా మహిళ తరఫు న్యాయవాది పిటిషనర్ గోప్యతకు భంగం వాటిల్లిందని వాదించారు. భార్యకు తెలియకుండా భర్త కాల్ రికార్డింగ్ చేశాడని ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్‌లను ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉపయోగించాలని భావిస్తున్నాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇలాంటి కేసులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్‌లోని హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు, తీర్పులను కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు భార్యకు తెలియకుండా భర్త సంభాషణను రికార్డ్ చేసినట్లుగా పేర్కొంది. ఇలా చేయడం ముమ్మాటికీ పిటిషనర్ గోప్యతకు భంగం కలిగించినట్లేనని గుర్తించింది. జీవించే హక్కులో గోప్యత కూడా ముఖ్యమైన భాగమని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.