భద్రాచలంకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం పాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి సత్యవతి విజయం సాధించారు. తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుంజా సత్యవతి మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ,కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.
2009-14లో అసెంబ్లీలో సత్యవతితో కలిసి పనిచేశానన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడే సత్యవతి.. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజాసంక్షేమం విషయంలో తన వాణిని బలంగా వినిపించేవారని కిషన్ రెడ్డి అన్నారు. సత్యవతి మృతిపట్ల బీజేపీ ఎమ్యెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.
కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సీపీఎంలో ఉండేవారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు.
ఆ తరువాత ఆమె బీజేపీలో చేరారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇంతలోనే సత్యవతి హఠాన్మరణం ఆ పార్టీ నేతలకు షాకింగ్‌గా మారింది.
