ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల నిధుల కోసం కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలు నిధులు పంపేందుకు భారీగా నగదు సమీకరిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్న సందర్భంగా కర్ణాటకలో ఆదాయపు పన్నుశాఖ దాడులు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మొత్తం రూ 94 కోట్ల నగదుతో పాటు రూ.8కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, 30 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఓ కాంట్రాక్టర్‌తో పాటు అతని కొడుకు, జిమ్ ఇన్స్ట్రక్టర్, ఆర్కిటెక్ సహా పలువురి నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు వివరణ ఇచ్చింది. అలాగే పలుచోట్ల ప్రభుత్వ కాంట్రాక్టర్లతో పాటు మరికొందరు వ్యక్తులపై ఐటీశాఖ దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్ 12 నుంచి దాడులు 55 ప్రదేశాల్లో దాడులు నిర్వహించామని, బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీతో పాటు పలుచోట్ల ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ సోదాల్లో సుమారు రూ.94కోట్ల నగదు, రూ.8కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు పేర్కొంది.
అదే సమయంలో ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద సుమారు 30 విదేశీ బ్రాండ్లకు చెందిన లగ్జరీ చేతి గడియారాలను సీజ్ చేసినట్లు వివరించింది. ఈ సోదాలలో పడ్డుబడిన డబ్బు కాంగ్రెస్ నేతలకు సంబంధించిందని బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ నళినీ కుమార్ కటీల్ ఆరోపించగా ఇవి నిరాధార ఆరోపణలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తోసిపుచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఏటీఎం ప్రభుత్వాన్ని నడుపుతున్నదని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుంచి నిధులు సమకూరుస్తున్నారని, స్వాధీనం చేసుకున్న డబ్బు కాంగ్రెస్‌దేనని కటీల్ ఆరోపణలు గుప్పించారు. ప్రజల సొమ్మును లూటీ చేసి దండుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా కేంద్రాల్లో బీజేపీ భారీ ప్రదర్శనలు చేపడుతుందని చెప్పారు.
రాష్ట్రంలో ఏటీఎం సర్కార్ నడుస్తోందని తాము చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధారాలు కోరిందని, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమకు ఆధారాలు అందించారని పేర్కొన్నారు. కొద్దిరోజుల కిందట కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేయగా ఓ కాంట్రాక్టర్ ఇంటి నుంచి రూ. 45 కోట్లు సీజ్ చేశారని కటీల్ పేర్కొన్నారు.
పట్టుబడిన డబ్బు కాంగ్రెస్ నేతలదేనని వెల్లడవుతోందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిధుల కోసం కర్నాటక ప్రభుత్వం ఏటీఎం ప్రభుత్వంలా మారి ప్రజల సొమ్మును లూటీ చేస్తోందని దుయ్యబట్టారు.