భారత్, పాక్ విడిపోయి ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తయింది. బ్రిటీష్ వారు దేశాన్ని విడిచి వెళ్లేటపుడు భారతదేశం నుంచి పాకిస్థాన్‌ను వేరు చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం పాకిస్థాన్‌గా ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య అప్పటి నుంచి వైరం కొనసాగుతూనే ఉంది.
భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే మన దేశంపైకి నిత్యం ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే దేశ విభజన గురించి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు దేశ విభజన అనేది చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు.
దేశ విభజన జరిగి ఉండాల్సింది కాదని, అది ఒక చారిత్రక తప్పిదమని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో ఒకే దేశంగా ఉన్న భారత్, పాక్‌లు దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా దేశ విభజన, అప్పటి పరిణామాల గురించి కూడా ఓవైసీ ప్రస్తావించారు.
ఇంకాస్త ముందుకు అడుగేసి మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ కావాలంటే ఈ అంశంపై ఒక చర్చ ఏర్పాటు చేయాలని సూచించారు. భారత దేశం రెండుగా చీలిపోవడానికి కారకులు ఎవరో తాను ఈ దేశ ప్రజలకు చెబుతానని చెప్పారు. అప్పుడు జరిగిన దేశ విభజనను ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాదని, దాని కోసం చాలా సమయం కావాలని తెలిపారు.
అందుకోసం ఒక డిబేట్ పెట్టాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ పుస్తకాన్ని చదవాలని ఓవైసీ సూచించారు. దేశాన్ని విభజించే ప్రతిపాదనను అంగీకరించవద్దని మౌలానా అబుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి వేడుకున్నారని ఓవైసీ తెలిపారు.
దేశ విభజన జరగడానికి ఆ సమయంలో అక్కడ ఉన్న నాయకులు అందరూ బాధ్యులే అని ఓవైసీ చెప్పారు. అప్పటి ఇస్లామిక్ పండితులు కూడా భారత్, పాక్ విడిపోవడాన్ని వ్యతిరేకించినట్లు అసదుద్దీన్ ఓవైసీ గుర్తు చేశారు.