స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఇరువైపుల వాదనలను విన్నది. మంగళవారం విచారణ ముగియడంతో తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఈ నేపథ్యంలో 73 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలని హరీశ్ సాల్వే కోరారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. సాల్వే విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు వయస్సు రీత్యా ఇదే కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆ రోజు నాటికి చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించాల్సి ఉంటుంది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడం మినహా శుక్రవారం వాదనలు ఉండే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం నాటికి లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తారు కాబట్టి సాయంత్రానికి తీర్పు రావొచ్చునని అంటున్నారు.