తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం జనసేనానితో కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
బీజేపీకి మద్దతు విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను బీజేపీ నేతలు పవన్ మద్దతును కోరారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి దగ్గరైంది.
బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని పవన్ భావిస్తుండగా, బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేదు. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ దూరంగా ఉంటోన్న నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తానని చెప్పడం గమనార్హం.
అలాగే రెండు మూడు రోజులలో మద్దతుపై నిర్ణయం ప్రకటిస్తామని జనసేనాని బిజెపి నేతలకు చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు వివరించారు.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని పవన్ దృష్టికి తెలంగాణ జనసేన తీసుకెళ్లింది. నేతల అభిప్రాయాలను విన్న పవన్ .. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని తెలిపారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
బీజేపీకి తొలి నుంచి పవన్ మద్దతుగా నిలుస్తున్నారు. ఏపీలో ఆ పార్టీతో ఆయన పొత్తులో ఉన్నారు. గతంలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ కావటం చర్చనీయాంశమైంది.
అయితే తెలంగాణ టీడీపీ నేతలు కూడా జనసేనతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. ఈ విషయమై పవన్‌తో చర్చిస్తామని ఈ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. అయితే అంతకు ముందే 32 స్థానాలకు జనసేన అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పవన్‌తో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా ? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే టీడీపీ పరిస్థితేంటి ? అనే చర్చ తెరపైకి వచ్చింది.