కర్ణాటకలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కన్నడ భాషను నేర్చుకుని మాట్లాడాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పిలుపునిచ్చారు. మైసూరు స్టేట్‌ను కర్నాటకగా పేరు మార్చి 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కర్ణాటక సంబ్రమ-50 చిహ్నాన్ని ఇక్కడి విధాన సౌథలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఏకీకరణ తర్వాత వివిధ భాషలు మాట్లాడేవారు రాష్ట్రంలో స్థిరపడ్డారని, అయితే కర్ణాటకలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కన్నడ భాషలోనే మాట్లాడాలని కోరారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో స్థానిక భాష నేర్చుకోకుండా జీవించడం అసాధ్యమని ఆయన తెలిపారు.
కాని కర్నాకటలో కన్నడ మాట్లాడకుండానే బతకవచ్చని, అదే కర్నాటకకు ఇతర పొరుగు రాష్ట్రాలకు మధ్య తేడా అని ఆయన చెప్పారు. కర్ణాటక ఏకీకరణ జరిగి 68 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రాష్ట్రంలో కన్నడ వాతావరణం సృష్టించకపోవడం తగదని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
ఇతరులకు మన భాషను నేర్పించాల్సిన కన్నడిగులు వారి భాషను నేర్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కన్నడ భాషా వికాసానికి, రాష్ట్ర అభివృద్ధికి, భాష, సంస్కృతి అభివృద్ధికి ఈ ధోరణి మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో అసలు కన్నడ భాషనే మాట్లాడడం లేదని పేర్కొంటూ కన్నడిగులకు ఆత్మాభిమానం లేదా అని ఆయన ప్రశ్నించారు. కన్నడిగుల ఔదార్యమే ఈ పరిస్థితికి కారణమని ఆయన చెప్పారు. ఇంగ్లీష్ భాష పట్ల మోజు మనలో చాలామందికి పెరిగిపోయిందని, చాలామంది మంత్రులు, అధికారులు ఇంగ్లీష్‌లోనే నోట్స్ రాస్తున్నారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు లేఖలు రాసినపుడు ఇంగ్లీష్‌లో రాయవచ్చని, రాష్ట్ర పరిధిలో వరకు కన్నడలోనే రాయవచ్చని ఆయన చెప్పారు. చాలా ఏళ్లుగా కన్నడ అధికార భాష అయినప్పటికీ పరిపాలనలో మాత్రం కన్నడను అమలు చేయకపోవడానికి నిర్లక్షమే ప్రధాన కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2023 నవంబర్ 1వ తేదీ నుండి ఏడాదిపాటు జరిగే కర్ణాటక సంబ్రమ ఉత్సవాల సందర్భంగా కన్నడ భాష పట్ల ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కృషి జరగాలని ఆయన పిలుపునిచ్చారు.