కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నవంబర్ 18న తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఉత్తరాఖండ్‌లోని కోర్టు సమన్లు జారీచేసింది.
డాక్టర్ గణేష్ ఉపాధ్యాయ అనే కాంగ్రెస్ పార్టీ అభిమాని ఉధంసింగ్ నగర్ జిల్లా కోర్టు, రుద్రాపూర్ సెషన్స్ జడ్జి కోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాకు సంబంధించి హింత బిశ్వ శర్మకు కోర్టు సమన్లు జారీ చేసింది.
2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కిచ్చా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని డాక్టర్ గణేష్ ఉపాధ్యాయ ఆరోపించారు.
నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాలు స్వాతంత్య్ర ఉద్యమం నుంచి దేశాభివృద్ధి వరకు దేశం కోసం తమ రక్తం ధారపోశాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. హిమంత తన విద్వేషపూరిత ప్రసంగంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి “ఏ తండ్రి కుమారుడివి నువ్వు..ఆధారాల కోసం మేము అడిగామా?” అంటూ నీచంగా మాట్లాడారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
హిమంత తన బహిరంగ ప్రసంగంలో రాహుల్ గాంధీతోపాటు ఆయన తల్లి, ఎంపి సోనియా గాంధీ వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచారని పిటిషనర్ పేర్కొన్నారు.
కాగా, 2023 అక్టోబర్ 17న హాజరుకావాలని హిమంత బిశ్వ శర్మను కోర్టు ఆదేశించినప్పటికీ ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాదుల బృందం అభ్యర్థన మేరకు నవంబర్ 18వ తేదీకి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. నవంబర్ 18న హిమంత కోర్టుకు హాజరవుతారని న్యాయవాదులు కోర్టుకు హామీ ఇచ్చారు.